అసోం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఆరుగురు అసోం పోలీసులు సహా ఓ పౌరుడు కూడా మృతి చెందాడు. ఈ విషయంపై కేంద్ర హోమ్ శాఖ కూడా విచారణకు ఆదేశించింది. అయితే వివాదం సద్దుమణుగుతున్న సమయంలో మిజోరాం ఎంపీ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. మిజోరాం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కె.వన్లవేనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఆవరణంలో విలేకరులతో మాట్లాడిన ఎంపీ వన్లవేనా... సరిహద్దు వద్ద వందల మంది అసోం పోలీసులు మిజోరాం సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించారని... ఆ తర్వాత తమ పోలీసులను వెనక్కి నెట్టి... వారిపై దాడి చేశారని వన్లవేనా ఆరోపించారు. వివాదంలో అసోం పోలీసులే ముందుగా ఫైరింగ్ ఆర్డర్ జారీ చేశారని కూడా వన్లవేనా ఆరోపించారు. తమపై దాడి చేసిన అసోం పోలీసులు ఎంతో అదృష్టవంతులన్న ఎంపీ.... వారిని చంపకుండా వదిలేశామన్నారు. మరోసారి ఇలా దాడికి యత్నిస్తే... వచ్చిన వారందరినీ ఖచ్చితంగా చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు ఎంపీ వన్లవేనా.

వన్లవేనా చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లుగా ఉంది. గొడవ సద్దుమణుగుతున్న సమయంలో ఎంపీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై అసోం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడం దారుణమన్నారు. అటు అసోం పోలీసులు కూడా ఎంపీ వన్లవేనాపై గుర్రుగా ఉన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎంపీపై కేసు నమోదు చేసిన అసోం పోలీసులు... ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఎంపీ వన్లవేనాను విచారించేదుకు ఆరుగురు సభ్యులతో కూడిన అసోం పోలీసుల ప్రత్యేక బృందం... ఢిల్లీ వెళ్లింది. అటు దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి రూ.5 లక్షల రూపాయలు నజరానా ప్రకటించింది అసోం ప్రభుత్వం. ఈ  గొడవల్లో ఆరుగురు పోలీసులు మృతి చెందగా... మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: