
అధికారం కోల్పోయినా సరే ఆధిపత్య పోరు తగ్గడం లేదు. చింత చచ్చినా పులుపు చావు లేదన్నట్లుగా టిడిపి నేతల వైఖరి ఉంది. ఇప్పటికే సీనియర్ నేత బుచ్చయ్య చౌదరీ ఎపిసోడ్‌తో పార్టీకి కాస్త డ్యామేజ్ జరిగింది. ఆయన మంచి కోసం చెప్పినా సరే పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు మాత్రం బయటపడ్డాయి. కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో విలువ లేదని బుచ్చయ్య మాటల ద్వారా అర్ధమైంది. కేవలం కార్పొరేట్ తరహాలోనే రాజకీయం జరుగుతుందని అర్ధమవుతుంది.
సరే బుచ్చయ్యని ఎలాగోలా బుజ్జగించి చంద్రబాబు సర్ది చెప్పారు. ఇక బుచ్చయ్య ఎపిసోడ్ ముగిసిందనుకునే లోపే జేసి ప్రభాకర్ రెడ్డి రచ్చ లేపారు. తాజాగా రాయలసీమ టిడిపి నేతల మీటింగ్ జరిగితే అక్కడకు వచ్చి, కార్యకర్తలని నాయకులు పట్టించుకోవడం లేదని, అలాగే చేస్తే భవిష్యత్‌లో పార్టీకి నష్టం జరుగుతుందని, అనంతపురంలో ఇద్దరు నేతల వల్ల టిడిపికి నష్టం జరుగుతుందని కామెంట్ చేశారు.
ఇక జేసి ప్రభాకర్‌కు కౌంటర్‌గా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీ స్పందించారు. ఇంచార్జ్‌లు ఎవరికి వారు ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలని చూసుకుంటున్నారని, జేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని మాట్లాడారు. అలాగే వైసీపీతో ఎవరు ములాఖత్ అయ్యారో తెలుసని, కాంగ్రెస్‌లో ఉండగా మీరు చేసిన అరాచకాలు ఏంటో అందరికీ తెలుసని ప్రభాకర్ చౌదరీ అన్నారు. ఇలా సొంత పార్టీ నేతల మధ్యే రచ్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. దీనికి బాబే చెక్ పెట్టాల్సిన అవసరముంది. లేదంటే ఆయనకే సినిమా కనిపిస్తోంది.