నానమ్మ ఇందిర ను ఫాలో అవుతున్న రాహుల్ గాంధీ.. అవును.. రాహుల్ గాంధీ తన నానమ్మను ఫాలో అవుతున్నారు.. ఏ విషయంలో అంటారా.. సొంత పార్టీలో అసమ్మతి నేతనుల ఎదుర్కొనే విషయంలో.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో రాహుల్ నాయకత్వానికి వ్యతిరేకంగా కొందరు సీనియర్లు జట్టు కట్టిన విషయం తెలిసిందే. వీరందరినీ జీ 23గా వ్యవహరిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో ఈ గ్రూపుల గొడవలు ఈనాటివి కాదు.. గతంలో ఇందిరాగాంధీ ప్రధాని అయిన తొలి రోజుల్లోనూ పరిస్థితి ఇలాగే ఉండేది.


కాంగ్రెస్‌లో మొదటి నుంచి మితవాదులు, అతివాదులు అన్న గ్రూపులు ఉండేవి.. అప్పట్లో నిజలింగప్ప, మోరార్జీ దేశాయ్, నీలం సంజీవరెడ్డి వంటి నేతలు ఇందిరకు వ్యతిరేకంగా ఉండేవారు. అయితే.. ఈ సమస్యను ఇందిర చాకచక్యంగా ఎదుర్కొన్నారు. పార్టీలోకి ఇతర పార్టీల నుంచి యువ నాయకులను ఆహ్వానించారు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీల్లో చురుకుగా ఉండే కుమార మంగళం వంటి నేతలను పార్టీలోకి తీసుకుని ప్రోత్సహించారు. సీనియర్లకు చెక్ పెట్టారు.


ఇప్పుడు కూడా కాంగ్రెస్‌లో అదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో ఉండి పోరాడలేని నేతలు నిస్సంకోచంగా పార్టీ వదిలి వెళ్లవచ్చని ఇటీవల రాహుల్ కామెంట్ చేశారు. అంతే కాదు.. ఇటీవల పార్టీలోకి ఇతర పార్టీల నుంచి యువ నాయకులను చేర్చుకుంటున్నారు. కన్నయ్య కుమార్, జిగ్నేశ్ మేవాని వంటి నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. జీ 23 గ్రూపు నాయకులను ఈ యువ నాయకత్వం ద్వారా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.


ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి యువ రక్తం అవసరం.. ఈ విషయాన్ని రాహుల్ గుర్తించాడు. అందుకే అవకాశం ఉన్న చోట్ల యువ నేతలను అవకాశం కల్పిస్తున్నాడు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వడం కూడా అందులో భాగంగానే చెప్పుకోవచ్చు. మొత్తానికి కాంగ్రెస్‌లో ఒకనాటి చరిత్ర మళ్లీ రిపీట్ అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ ఏమేరకు సక్సస్ అవుతాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: