ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే కొత్త వేరియంట్ కేసులు భారత్‌లో కూడా నమోదయ్యాయి. దీంతో అందరిలో కలవరం మొదలైంది కూడా. ఇక కరోనాను ఎదుర్కొవాలంటే ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే మాస్క్ లేకపోతే... వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని ఇప్పటికే పోలీసు శాఖకు ఆదేశాలు కూడా చేసేసింది. అటు బెంగళూరులో ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన వ్యక్తి ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసున్నాడని... అయినా సరే... ఆయనకు వైరస్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఇప్పుడు వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న వారు కూడా భయపడే పరిస్థితి. ఓ వైపు కేసులు తగ్గుముఖం పట్టడంతో... క్రమంగా అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబంలో మొత్తం ఆరుగురికి వైరస్ పాజిటివ్ సోకడంతో.. ఇప్పుడు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

సూర్యాపేట జిల్లాకు చెందిన వైద్యాధికారి డాక్టర్ కోటాచలం కుటుంబం మొత్తం ఇప్పుడు వైరస్ బారిన పడింది. ఆర్టీ - పీసీఆర్, ర్యాపిడ్ రెండు టెస్టుల్లో కూడా కరోనా పాజిటివ్‌గా రుజువైంది. ఇందుకు ప్రధానంగా ఆయన కుమారుడే కారణమంటున్నారు వైద్యులు. వారం రోజుల క్రితం డాక్టర్ కోటాచలం కుమారుడు జర్మనీ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా... ఆయన కుటుంబ సభ్యులంతా కూడా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటించిన అనంతరం రెండు రోజుల క్రితమే సూర్యాపేటకు తిరిగి చేరుకున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో... కుటుంబం మొత్తం పరీక్షలు చేయించుకోగా... వైరస్ సోకినట్లు తేలింది. సరిగ్గా రెండు రోజుల క్రితమే డిసెంబర్ ఒకటవ తేదీన ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా డాక్టర్ కోటాచలం పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు వైద్య సిబ్బందిలో కూడా కలవరం మొదలైంది. కోటాచలం కుటుంబం మొత్తం ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆరుగురికి వైరస్ సోకినట్లు తేలడంతో.. తిరుపతి అధికారులు కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యారు. కొత్తగా ఎవరికైనా వైరస్ లక్షణాలున్నాయా అని సర్వే చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: