భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వీ. రమణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైనది మధ్యవర్తిత్వమని సీజేఐ వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వానికి మరింత ఆదరణ అవసరమన్నారు సీజేఐ. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్.వీ.రమణ పాల్గొన్నారు. దేశంలో న్యాయం కోరుకునే వారికి కోర్టులు చివరి మజిలీ కావాలన్నారు సీజేఐ. ఎవరైనా సరే... కోర్టుకు రావడం ఆఖరి ప్రత్యామ్నాయం కావాలన్నారు జస్టిస్ ఎన్.వి.రమణ. న్యాయం కోసం ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరగడం వల్ల సకాలంలో ఫలితం రావడం లేదన్నారు. కాలయాపన జరుగుతుందన్నారు కూడా. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యం కావాలంటే... విస్తృత సంప్రదింపులే ఏకైక మార్గమన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సన్నాహక సదస్సులో ముఖ్య అతిథిగా సీజేఐ హాజరయ్యారు. కోర్టులకు వచ్చే ముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలకు పరిష్కారాలు తక్కువ సమయంలోనే లభిస్తాయన్నారు జస్టిస్ ఎన్.వి.రమణ. దీని ద్వారా పెండింగ్ కేసుల సత్వర విచారణ జరగాలని కూడా సూచించారు. మధ్యవర్తిత్వం ప్రస్తావన మన పురాణాల్లో కూడా ఉందని... ముఖ్యంగా మహాభారతంలో కూడా ఉన్నట్లు గుర్తు చేశారు. సంప్రదింపుల ద్వారా సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందన్నారు. ఆస్తుల పంపకాలను కుటుంబ సభ్యులే సామరస్యంగా పరిష్కరించుకోవచ్చన్నారు. మహిళలు తమ మధ్య వివాదాల్లో సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వానికే మొగ్గు చూపుతారని... ఇలాగే అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దక్కుతుందన్నారు. న్యాయ వ్యవస్థలో కూడా ప్రస్తుతం సంస్కరణలు అవసరమని సీజేఐ ఎన్‌వి రమణ సూచించారు. న్యాయస్థానలకు వచ్చే కేసుల సంఖ్య తగ్గాలనేది తన అభిప్రాయం అన్నారు సీజేఐ. ఆస్తి పంపకాలు, పొలం తగాదాల కేసుల పరిష్కారం కోసం మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమన్నారు సీజేఐ.


మరింత సమాచారం తెలుసుకోండి: