
ఏపీలో ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందా ? కొద్ది రోజుల క్రితం ఆయన నియోజకవర్గానికి చెందిన సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ కనిపించడం లేదా ? అంటే ప్రస్తుతం ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో అవును అన్న చర్చలే వినిపిస్తున్నాయి. బాలినేని రాజకీయాల్లో చాలా స్పీడ్ గా ఎదిగారు. నాలుగు సార్లు గెలిచిన ఆయన ... 2014 ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు. అయితే ఆయన ఓడిపోయినప్పుడు నాలుగు సంవత్సరాలు అసలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే లేరన్న విమర్శలు ఉన్నాయి.
నాలుగు సంవత్సరాలపాటు ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నారని... ఎన్నికల చివరి సంవత్సరంలో మాత్రమే ఆయన ఒంగోలుకు వచ్చారని సుబ్బారావు గుప్తా చెప్పారు. వాస్తవంగా ఒంగోలులో జరుగుతున్న చర్చ ప్రకారం ఆయన చెప్పింది నిజమే అని అంటున్నారు. విచిత్రమేంటంటే 2014 ఎన్నికల్లో బాలినేని ఓడిపోయినా ... ఆయన ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ...వైసీపీ కేడర్ కు అందుబాటులో లేకపోయినా కూడా ఆయనకు లక్ కలిసి వచ్చేసింది.
సామాజిక పరంగా మాత్రమే కాకుండా జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాలు కూడా ఆయనకు కలిసి వచ్చి ఆయన్ను మంత్రిని చేశాయి. బాలినేని ముందు నుంచి చాలా లక్కీ పర్సన్ అని చెప్పుకోవాలి. ఆయన సమకాలికులైన మంత్రి శ్రీనివాసరావు - కాకుమాను రాజశేఖర్ కు కాలం కలిసి రాలేదు. వీరు ముగ్గురూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు.
మంత్రి శ్రీనివాసరావు మున్సిపల్ చైర్మన్ పదవితో సరిపెట్టుకున్నారు. దళిత కుటుంబానికి చెందిన రాజశేఖర్ నామినేటెడ్ పదవి తో సరి పెట్టుకుంటే... బాలినేని మాత్రం వీరిద్దరి కంటే చాలా వేగంగా ఎదిగి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం తోపాటు ఏకంగా మంత్రి అయ్యారు. ఇప్పుడు సుబ్బారావు గుప్తా బాలినేనిపై విమర్శలు చేసిన నేపథ్యంలో.. ఆయన , పార్టీ అధికారంలో ఉండటంతో ఏదో అలా గుప్తాను సైలెంట్ చేశారని.. వచ్చే ఎన్నికల్లో బాలినేనికి సొంత కేడరే ఆయనకు వ్యతిరేకంగా పని చేసే ప్రమాదం ఉందని పార్టీ నేతల్లోనే చర్చ నడుస్తోంది.