పరిటాల ఫ్యామిలీకి సీట్ల విషయంలో క్లారిటీ రావడం లేదు. ఒక రాప్తాడు సీటు అయితే ఫిక్స్ కానీ..ధర్మవరం సీటు ఇస్తారో లేదో ఇంకా డౌట్ గానే ఉందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్...రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటు ధర్మవరంలో గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఓడిపోయాక సూరి టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్ళిపోయారు.

దీంతో రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు కూడా పరిటాల శ్రీరామ్‌కే అప్పగించారు. అయితే రాప్తాడు ఎలాగో సునీతమ్మ చూసుకుంటున్నారు. దీంతో ధర్మవరం బాధ్యతలని శ్రీరామ్ చూసుకుంటున్నారు. ఇక వారికి రెండు సీట్లు ఖాయమనే కోణంలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంతవరకు అధికారికంగా సీట్లు మాత్రం ఫిక్స్ చేయలేదు. రాప్తాడు ఓకే గానీ...ధర్మవరం విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఒకవేళ రాప్తాడు ఒకటే సీటు వస్తే...ఇక్కడ శ్రీరామ్ పోటీ చేయాల్సి వస్తుంది. లేదంటే ధర్మవరం సీటు కూడా వస్తే...శ్రీరామ్ బరిలో దిగుతారు. రాప్తాడులో సునీతమ్మ పోటీ చేస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ధర్మవరం సీటు కోసం సూరి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీలో పనిచేస్తున్న ఆయన, టీడీపీలోకి రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. పైగా టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటులో సూరి పోటీ చేస్తారని, ఆయన అనుచరులు చెబుతున్నారు.

పార్టీలో ఎవరినైనా ఆహ్వానిస్తామని, కానీ సీటు మాత్రం ఇవ్వమని, ఒకవేళ సీటు ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని శ్రీరామ్ మాట్లాడారు. అయితే చంద్రబాబు పరిస్తితులకు తగ్గట్టుగా సీట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర్మవరంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు సీటు ఇస్తారని తెలుస్తోంది. కాకపోతే ధర్మవరంలో శ్రీరామ్‌కు క్రేజ్ ఎక్కువే ఉంది..ఆయనని కాదని సూరికి సీటు ఇస్తే...పరిటాల వర్గం సహకరించే పరిస్తితి ఉండదు. అప్పుడు టీడీపీకే డ్యామేజ్. కాబట్టి పరిటాల ఫ్యామిలీకి రెండు సీట్లు ఇవ్వాల్సిన పరిస్తితి. మరి చూడాలి ధర్మవరం విషయంలో బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: