వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏదో పెద్ద ప్లాన్లోలోనే ఉన్నారు. ఈరోజు హాజరవ్వాల్సిన సీఐడీ విచారణకు హాజరుకాలేదు. ఢిల్లీ నుండి సీఐడీ అధికారులకు రాజు ఒక లేఖ రాశారు. తనకు అనారోగ్యంగా ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేనని ఎంపీ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. సీఐడీ నోటీసులు అందుకున్న ఎంపీ నరసాపురంకు కాకుండా ఢిల్లీకి వెళ్ళి లాయర్లను కలిశారు. ఆ తర్వాత మూడు రోజులు ఏమీ మాట్లాడకుండా సీఐడీకి లేఖరాయటమే విచిత్రంగా ఉంది.
ఢిల్లీకి చేరుకున్న ఎంపీ సీఐడీ విచారణకు స్టే కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కోర్టులో సీఐడీ నోటీసులను కోర్టులో చాలెంజ్ చేశారట. అయితే కోర్టులో ఏమి జరిగిందో క్లారిటి లేదు. ఇందులో భాగంగానే విచారణకు హాజరైతే ఈసారి ఏమవుతుందో అన్న భయం ఎంపీలో పెరిగిపోతున్నట్లుంది. కోర్టు ద్వారా రక్షణ దొరికేంతవరకు ఏపీలోకి అడుగుపెట్టకూడదని అనుకున్నట్లున్నారు. అందుకనే చివరి నిముషంలో అనారోగ్యం, డాక్టరును కలవాలని, రెస్టు తీసుకోవాలని చెప్పి నాలుగు వారాలు సమయం కావాలని కోరారు. ఒకవైపు సీఐడీకి అనారోగ్యంగా ఉందని లేఖ రాసి మరోవైపు అధికారపార్టీపై రచ్చ మొదలుపెట్టారు.
ఎంపీ అనుకుంటున్నట్లు సీఐడీ విచారణపై స్టే ఇవ్వకపోతే ఏమవుతుందనేది ఆసక్తిగా మారింది. ఇపుడు విచారణలో ఉన్న కేసుతో పాటు తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు కూడా నమోదైంది. దీని విచారణకు కూడా హాజరవ్వాల్సుంటంది. పైగా ఎంపీ ఎవరినో తిడితే పెట్టిన కేసు కాదు. స్వయంగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను తిట్టారని, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఎంపీ మీద ఫిర్యాదు చేస్తే ఎస్సీ అట్రాసిటి కేసు నమోదుచేశారు. తమ ఉన్నతాధికారినే తిట్టారనే కేసు నమోదైన తర్వాత ఇక పోలీసులు ఎంపీని వదులుతారా ?
జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఎంపీ రాజీనామా చేయటంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముందేమో ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత రాజీనామా చేస్తానన్నారు. తర్వాతేమో మే 14వ తేదీ తర్వాత ఏమి జరుగుతుందో చూడమన్నారు. తాజాగా సీఐడీ నోటీసులు, ఎస్సీ అట్రాసిటి కేసు నమోదైంది. మరీ నేపధ్యంలో రాజీనామా చేస్తే రఘురాజుకు చాలా ఇబ్బందులు తప్పవు. ఇపుడు ఎంపీగా ఉన్నారు కాబట్టే ఆయన అడిగిన వెంటనే కేంద్రమంత్రులు అపాయిట్మెంట్లు ఇస్తున్నారు. రేపు ఎంపీగా రాజీనామా చేస్తే మాజీ అయిపోతారు. అప్పుడు రాజును ఎందుకు పట్టించుకుంటారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: