ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో  ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.  రాబోయే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవటం బీజేపీకి ముఖ్యమైతే అధికారంలోకి రావటం ఎస్పీకి అంతే ముఖ్యం. మిగిలిన పార్టీల్లో అత్యధికం ఉంటే బీజేపీతోనో లేకపోతే ఎస్పీతోనే మిత్రపక్షాలుగా ఉన్నాయి. బీఎస్పీ మాత్రమే ఒంటిరిగా పోటీలోకి దిగుతోంది. కాకపోతే ఆ పార్టీ అధినేత్రి మాయావతి వైఖరిపైనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.




విషయానికి వస్తే ప్రధాన పార్టీల్లో టెన్షన్ ఎందుకు పెరిగిపోతోంది ? ఎందుకంటే ఎంఐఎం వల్లే. యూపీలో ముస్లిం జనాభా బాగా ఎక్కువ. 12 జిల్లాల్లోని 145 నియోజకవర్గాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. వీటిలో సుమారు 100 నియోజకవర్గాల్లో గెలుపోటములను ముస్లిం ఓటుబ్యాంకే డిసైడ్ చేస్తుంది. పోయిన ఎన్నికల్లో బీజేపీ ఒక్కటంటే ఒక్క ముస్లిం అభ్యర్ధికి కూడా టికెట్ ఇవ్వలేదు. అయినా అనేక కారణాల వల్ల ముస్లిం ప్రాబల్యమున్న నియోజకవర్గాల్లో కూడా గెలిచింది.




అయితే ఇపుడా సీన్ లేదు. అందుకనే అన్నీ పార్టీలు ముస్లిం నేతలు, ఓటుబ్యాంకు వెంటపడ్డాయి. బీజేపీ ఎంతమండి ముస్లింలకు టికెట్లిస్తుందో చూడాలి. ఎస్పీ మాత్రం ముస్లిం-జాట్-యాదవ-వోబీసీ మంత్రంతో వెళుతోంది. ఈ నేపధ్యంలోనే ఎంఐఎం కూడా రంగంలోకి దూకింది. ముస్లింల ఓటు బ్యాంకు బలంగా ఉన్న 100 నియోజకవర్గాలను గుర్తించి వందమంది అభ్యర్ధులను పోటీలోకి దింపుతోంది. ఇక్కడ ఎంఐఎం తరపున పోటీ చేయబోయే వాళ్ళల్లో ఎంతమంది గెలుస్తారన్నది పాయింట్ కాదు. ప్రత్యర్ధుల్లో ఎవరి గెలుపును దెబ్బ తీస్తుందనేదే కీలకం.




పోయిన ఎన్నికల్లో 38 మంది ఎంఐఎం తరపున పోటీచేస్తే ఒక్కరు కూడా గెలవలేదు. కానీ ముస్లిం ఓట్లను చీల్చటం ద్వారా ఎస్సీ, బీఎస్పీ అభ్యర్ధులను బాగా దెబ్బకొట్టారు. ఇపుడు కూడా అదే ఫార్ములాతో ఎంఐఎం అభ్యర్ధులను పోటీలోకి దింపుతోంది. అదృష్టం దక్కితే గెలుపు లేదా ఓట్లు చీల్చాలన్నదే టార్గెట్ గా పెట్టుకుంది. ఈ కారణంతోనే ఎంఐఎం అంటే ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. చివరకు ఎంఐఎం అభ్యర్ధుల దెబ్బ ఎవరిమీద పడుతుందో చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: