రెండురోజులుగా ఎమ్మెల్యే రోజా రాజీనామా అంశం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. స్థానిక నాయకుడు చక్రపాణి రెడ్డికి వైసీపీలో ప్రాధాన్యం పెరగడంతో రోజా అలకబూనారని, రాజీనామా చేస్తానని అన్నారని మీడియాలో ప్రముఖంగా వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో కూడా రోజా రాజీనామా అంటూ హడావిడి నడిచింది. ఆ తర్వాత ఎమ్మెల్యే రోజా.. తన రాజీనామా అంశంపై క్లారిటీ ఇవ్వడంతోపాటు.. తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

నేనెందుకు రాజీనామా చేస్తాను..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందునుంచీ తాను జగన్ తోనే ఉన్నానని, ఆయన వెంటే నడిచానని, తానెందుకు పార్టీకి రాజీనామా చేస్తానంటూ ప్రశ్నిస్తున్నారు రోజా. అదే సమయంలో కొంతమంది పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని, అసలు తనకి ఆ ఆలోచనే లేదని చెప్పారు రోజా. గతంలో చక్రపాణి రెడ్డికి, తమ ప్రభుత్వంలోనే కొందరు పెద్దల మద్దతు ఉందని విమర్శలు చేశారు రోజా. అయితే రాజీనామా అంశంపై మాత్రం ఆ తెరవెనక శక్తులెవరనేది రోజా చెప్పలేదు.

ఇంతకీ రోజాపై దుష్ప్రచారం చేసింది ఎవరు..?
రోజా రాజీనామా వ్యవహారంపై ప్రచారం ఓ పద్ధతి ప్రకారం జరిగింది. ఆమె రాజీనామా చేస్తున్నారని ముందు సోషల్ మీడయాలో లీకులొచ్చాయి, ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలొచ్చాయి, అరగంట సేపు కథనాలు వండి వార్చారు. అయితే ఎక్కడా రోజా నేరుగ తన రాజీనామా గురించి ప్రస్తావించలేదు. కేవలం ఊహాగానాలను మాత్రమే ప్రసారం చేసి, రోజా రాజీనామా అంటూ టైటిల్స్ పెట్టారు. అసలే చక్రపాణి రెడ్డితో గొడవలున్నాయి, ఆయనకు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా అవకాశం ఇవ్వడంతో రోజా రాజీనామా అంశానికి మరింత బలం చేకూరింది. దీంతో అసలు రాజీనామా ప్రస్తావన రోజాయే చేశారన్నంతగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత రోజా దాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరో కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో రోజా రాజీనామా ప్రచారం వెనక ఎవరో బలమైన శక్తి ఉన్నారనే విషయం అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: