ఆమె విశాఖ జిల్లాలో గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి లేడీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత పార్టీ మారిన ఆమె రాజ‌కీయంగా ట్ర‌బుల్స్‌లో ప‌డినా చివ‌ర‌కు తన డేరింగ్ నిర్ణ‌యంతో ఇప్పుడు సీటు తెచ్చుకున్నారు ఆమె ఎవ‌రో కాదు విశాఖ జిల్లాలోని గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గమైన పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. ఆమె తాజా ఎన్నిక‌ల్లో పట్టుబట్టి మరీ టిక్కెట్ సాధించుకున్నారు. పట్టు అనేకంటే ఒకకరకంగా బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్ తెచ్చుకున్నారనే చెప్పాలి.


ఆమెకు టిక్కెట్ రాకుండా ఏపీ టీడీపీ అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు అడ్డు ప‌డ్డారంటూ ఆమె చేసిన కామెంట్లు కూడా సంచ‌ల‌నం అయ్యాయి. ముందు పాడేరు సీటును టీడీపీ అధిష్టానం రమేష్ నాయుడు అనే వ్య‌క్తికి కేటాయించింది. గిడ్డి ఈశ్వరి అంత తేలిగ్గా తలొగ్గలేదు.. త‌న పోరాటం ఆప‌లేదు. తాను తగ్గేదేలేదంటూ అనుచరులతో సమావేశమవ్వ‌డంతో పాటు త‌న‌కు సీటు రాక‌పోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించారు.


ఇక్క‌డే ఆమె గేమ్ కూడా ప్లాన్ చేశారు. త‌న‌కు టిక్కెట్ రాక‌పోయినా...  తనకు టిక్కెట్ ఇవ్వని అధినాయకత్వాన్ని ఒక్క మాట అనలేదు. అచ్చెన్నాయుడు మీద మాత్రం అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు త‌లొగ్గారు. ముందు ప్రకటించిన రమేష్ నాయుడిని కాదని బీఫారం గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు ఇచ్చేశారు.  ఈశ్వ‌రి సీటు ద‌క్కించుకున్నా పాడేరులో ఉన్న ఓ సెంటిమెంట్ నేప‌థ్యంలో ఈశ్వ‌రి గెలుపుపై డౌట్లు ఉన్నాయి.


ఇక్క‌డ 1999లో టీడీపీ నుంచి మణికుమారి గెలిచారు. అదే టీడీపీకి అక్కడ చివరి విజయం. అంటే దాదాపు రెండున్నర దశాబ్దాలుగా అక్కడ టీడీపీ జెండా ఎగురలేద‌న్న‌ది ఆ పార్టీ కి చాలా మైన‌స్‌. ఇప్పుడు గిడ్డి ఇక్క‌డ టీడీపీ నుంచి గెలిస్తే రికార్డే అవుతుంది. ఈశ్వ‌రి ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి మత్స్యరాజు విశ్వేశ్వరరాజును ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని పార్లమెంటు అభ్యర్థిగా పోటి చేయించి ఇక్కడ విశ్వేశ్వరరాజుకు సీటు ఇచ్చారు జ‌గ‌న్‌. మ‌రి ఈశ్వ‌రి ఈ సారి పాడేరులో టీడీపీ జెండా ఎగ‌రేసి రికార్డు క్రియేట్ చేస్తుందా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: