రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. ఈ క్రమంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గెలుపు పాఠాలు నేర్పుతూనే పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో పక్కా ప్లాన్ తో ముందుకు దూసుకుపోతోంది. ఇటీవలే నామినేషన్ల పర్వం ముగియడంతో వివిధ నియోజక వర్గాల్లో బీజేపీ ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను బరిలో నిలిపిందన్న ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది. హైకమాండ్ ఆదేశాలతోనే 3 పార్లమెంట్ స్థానాల్లో ఇతరులకు కూడా పార్టీ బీ ఫాం ఇచ్చిందన్న ప్రచారం ఇపుడు మీడియాలో జరుగుతోంది. ఎక్కడంటే? నల్గొండ, పెద్దపల్లి, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పార్టీ మరికొందరి నేతలతో నామినేషన్ వేయించిందని గుసగుసలు వినబడుతున్నాయి.

అవును, పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్, నల్గొండ నుంచి నూకల నరసింహ రెడ్డి, హైదరాబాద్ నుంచి సుభాష్ చందర్ తో బీజేపీ నామినేషన్ వేయించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే వాస్తవానికి పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని మార్చుతారని , బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతను బీజేపీ అభ్యర్థిగా బరిలో దించుతుందని అంతా అనుకున్నారు. కానీ, గోమాస శ్రీనివాస్ కే బీ ఫాం ఇచ్చినా మరో నేతను కూడా రంగంలోకి దింపిందన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది. నల్గొండ అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించినా బీఆర్ఎస్ నేత తేరా చిన్నప్పరెడ్డిని పార్టీలో చేర్చుకొని బీజేపీ బరిలో నిలుపుతుందని గుసగుసలు వినబడుతున్నాయి. బీజేపీ నేతలకు సైదిరెడ్డికి మధ్య ఏమాత్రం పొసగడం లేదని దాంతో అభ్యర్థి మార్పు ఖాయమని స్థానిక నేతలు చెప్పుకొచ్చారు.

కానీ, అక్కడ నూకల నరసింహ రెడ్డితో కూడా బీజేపీ నామినేషన్ వేయించిందని ఇపుడు టాక్ వినబడుతోంది. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత హనుమాన్ శోభా యాత్రలో వివాదాస్పదంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసినదే. మసీదుకు బాణం గురి పెట్టినట్లుగా ఇచ్చిన ఫోజ్ వ్యవహారంపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన అందరికీ తెలిసినదే. ఆమెకు ఈ కారణంగానే బీ ఫాం ఆలస్యంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఇక్కడి నుంచి మరొకరికి కూడా బీ ఫాం జారీ చేసినట్లుగా చర్చ వేడిగా జరుగుతోంది. కంటోన్మెంట్ విషయంలోనూ బీజేపీ ఇదే చేసిందనే టాక్ బలంగా నడుస్తోంది. బీజేపీ ఇలా ఎందుకు చేసిందనే విషయం చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

BJP