ఉక్రెయిన్‌ పై దాడికి దిగిన రష్యా ఇప్పుడు ఏమాత్రం తగ్గనంటోంది. అయితే రష్యా వైఖరిని తప్పుబడుతున్న దేశాలు.. ఆ దేశంపై ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నాయి. అయితే.. రష్యా మాత్రం ఆ ఆంక్షలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నా.. నేను పట్టించుకోనని రష్యా నిక్కచ్చిగా చెబుతోంది. అంతే కాదు.. ఈ ఆంక్షల అంశాన్ని రష్యా చాలా లైట్‌ గా తీసుకుంటోంది. అక్కడితో ఆగకుండా అసలు ఇవి ఆంక్షలేనా అంటూ.. అద్భుతమైన ఆంక్షలంటూ సెటైర్లు కూడా వేస్తోంది.


రష్యాపై ఇప్పటికే అమెరికా సహా దాని మిత్రపక్షాలు ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలను అద్భుతమైన ఆంక్షలుగా రష్యా వ్యంగ్యంగా వర్ణిస్తోంది. ఈ అద్భుతమైన ఆంక్షలతో పరిస్థితుల్లో  ఎలాంటి మార్పూ ఉండబోదని రష్యా తేల్చి చెప్పింది. అంటే మీరేం చేసుకుంటారో చేసుకోండి మా దాడులు మాత్రం కొనసాగుతాయని రష్యా ప్రపంచానికి తేల్చి చెప్పినట్టయింది.  ఉక్రెయిన్ లోని డొన్ బాస్ ప్రాంతాన్నిరక్షించేందుకు తాము చేపట్టిన మిలిటరీ ఆపరేషన్  కొనసాగుతుందని రష్యా క్లారిటీ ఇచ్చేసింది.


అంతే కాదు.. వ్లాదిమిర్ పుతిన్ తాను అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ఉక్రెయిన్ పై  సైనిక చర్య ఆగదని రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదెవ్ స్పష్టం చేసారు. అమెరికా విదేశాంగ శాఖలోని వారికి కూడా రష్యా వైఖరి ఏంటో స్పష్టంగా తెలుసని ఆయన అంటున్నారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు ఇతర నగరాలపైనా దాడులను ముమ్మరం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్‌ దేశం అతలాకుతలమవుతోంది. రష్యా సైన్యాలు భారీగా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి.


ఉక్రెయిన్ ఒంటరిగా మిగలడంతో ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పొరుగు దేశాలకు వలసపోతున్నారు. ఇప్పటివరకు లక్ష మంది వరకూ ఉక్రెయిన్‌ వాసులు తమ దేశానికి వచ్చినట్టు పోలాండ్‌  చెబుతోంది. మరి ఈ యుద్ధం ఎంత కాలం సాగుతుందో.. చర్చల ప్రక్రియ ఎప్పుడు కొలిక్కి వస్తుందోనని ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: