మక్కల్ నీది మయ్యం అనే పేరుతో తమిళనాట రాజకీయ పోరాటం మొదలు పెట్టారు కమల్ హాసన్. విశ్వ నటుడు అనే పేరున్నా కూడా రాజకీయాల్లో ఆయన్ను తమిళ ప్రజలు ఆదరించలేదు. కనీసం ఆయన పోటీ చేసిన స్థానంలో కూడా ఆయన గెలవలేదు. అయితే తాజాగా కమల్ హాసన్ పార్టీని మూసేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. అంటే కమల్ రాజకీయాల్నుంచి తప్పుకుంటున్నట్టు కాదు, కేవలం పార్టీ మార్చేస్తున్నారంతే. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ విజయం తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కమల్ హాసన్ స్వయంగా కలిసి అభినందించారు. కమల్ హాసన్ ఢిల్లీకి వెళ్లారు. ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. తర్వాత కాసేపు కేజ్రీవాల్, కమల్ హాసన్ మధ్య చర్చలు జరిగాయి. పంజాబ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా స్నేహితుడు కేజ్రీవాల్ కి, ఆమ్ ఆద్మీ పార్టీకి అభినందనలు.. అంటూ ఆ తర్వాత కమల్ హాసన్ సోషల్ మీడియాలో మెసేజ్ ఉంచారు. ఈ పొగడ్తలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కలసి పనిచేస్తారా..?
కమల్‌ హాసన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ మంచి స్నేహితులు. చాన్నాళ్లుగా వారి మధ్య సత్సంబంధాలున్నాయి. అసలు కమల్‌ హాసన్‌ ని రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చింది కూడా కేజ్రీవాలేనని చెబుతుంటారు. అయితే కమల్ హాసన్ సొంతగా మక్కల్ నీది మయ్యం అనే పార్టీ పెట్టి తమిళనాడులో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కమల్ హాసన్ కేజ్రీవాల్ ని కలవడం సంచలనంగా మారింది. కమల్ హాసన్ తమిళనాడులో ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకుంటారా.. లేక తన పార్టీని ఆమ్ ఆద్మీలో విలీనం చేస్తారా అనేది వేచి చూడాలి. కమల్ ఊపు చూస్తుంటే ఆమ్ ఆద్మీలో తన పార్టీని విలీనం చేసి, తమిళనాడులో ఆ పార్టీకోసం పనిచేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సొంతగా పార్టీని నడిపి, ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం కంటే.. కేజ్రీవాల్ క్రేజ్ తో చీపురు గుర్తుపై పోటీ చేసి గెలవడం ఈజీ అని కమల్ అంచనా వేస్తున్ట్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే కమల్ హాసన్ త్వరలో తన పార్టీని మూసేయడం ఖాయం. ఆ తర్వాత కేజ్రీవాల్ తో చేతులు కలిపి కొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: