నిన్నటి వరకు నాగబాబు వర్సెస్ నారాయణ అన్నట్టుగా వ్యవహారం ఉంది. చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలకు నాగబాబు రియాక్ట్ కావడం సోషల్ మీడియాలో జనసైనికులకు ఉపదేశం ఇవ్వడం, వాళ్లంతా నారాయణను ఓ రౌండ్ వేసుకోవడం అన్నీ గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఆ తర్వాత నారాయణ ఎట్టకేలకు దిగొచ్చారు. తాను చిరంజీవిపై మాట్లాడిన మాటల్ని భాషాదోషంగా పరిగణించాలన్నారు. కావాలని తాను ఆ మాటలు అనలేదని చెప్పుకొచ్చారు.

అయితే నారాయణ వ్యాఖ్యలు మాత్రం మెగా అభిమానుల్ని బాగా బాధించాయి. దీంతో వారంతా నారాయణపై సోషల్ మీడియాలో తిరగబడ్డారు. ప్రధాని మోదీ సభకు చిరంజీవిని ఆహ్వానిస్తే నారాయణకు ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు. నారాయణకు ఆహ్వానం లేకపోతే సైలెంట్ గా ఉండాలని, ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవకూడదో చెప్పేంద పెద్ద మనిషి నారాయణ కాదని అన్నారు.

అయితే జనసైనికులు, చిరంజీవి అభిమానులు మాత్రం ఎక్కడా తగ్గలేదు, సీపీఐ నారాయణ వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శనకు రావడంతో అక్కడ అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆయన వెంట పడ్డారు. ఆయన్ను ఎక్కడా తిరగనివ్వబోమన్నారు. అప్పటికే ఆయన సామాజిక మాధ్యమాల్లో తన భాషాదోషం గురించి చెప్పుకొచ్చారు. కానీ ఎవరూ నారాయణను వదిలిపెట్టలేదు, వదిలి పెట్టేలా లేరు. దీంతో చివరకు మళ్లీ నాగబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

పాపం వదిలేయండి..
తప్పు ఎవరు చేసినా సరే, ఒకసారి క్షమించాలని అడిగిన తర్వాత వారికి క్షమాభిక్ష పెట్టడం జనసైనికుల ధర్మమని అన్నారు నాగబాబు. సీపీఐ నారాయణ పెద్ద వయసు దృష్టిలో ఉంచుకుని ఆయన్ను వదిలేయాలని జనసైనికులకు మరోసారి పిలుపునిచ్చారు నాగబాబు. ఆయన్ను ట్రోల్ చేయడం ఆపండి అని జనసైనికులకు నాగబాబు సందేశాన్నిచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ కి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడ్డట్టయింది. మరి ఇప్పటికైనా జనసైనికులు తగ్గుతారా లేక నారాయణను ట్రోల్ చేయడం కొనసాగిస్తారా వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: