ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా సమీకరణాలు జోరుగా మారిపోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి కొన్ని అంశాలు వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమాను ఇస్తుంటే... మరికొన్ని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రెండు ఫీలింగ్స్ కలగడానికి కారణం మాత్రమే ఒకరే కావడం విశేషం. అది మరెవరో కాదు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పార్టీని స్థాపించిన నాటినుండి తాను రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ తన అనుభవం అందుకు సరిపోవడం లేదు... కనీసం ఒక్కసారి అయినా ప్రజాప్రతినిధిగా గెలిచి ప్రజలకు సేవ చేస్తేనే అతనికి తెలుస్తుంది. ఇదిలా ఉంటే... ఏపీలో 2024 ఎన్నికలకు సమయం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఉంది.

ఈ తక్కువ కాలంలో ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చే నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు. అందులో అటు చంద్రబాబు మరియు పవన్ లతో పోలిస్తే జగన్ చాలా వరకు మేలు అన్నది ప్రజల నిర్ణయం. కానీ గత కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జనసేన పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది అని చెప్పాలి. కానీ ఎప్పటిలాగే పవన్ మనసులో ఒక విషయం మాత్రం బలంగా నాటుకుపోయి ఉంది. నా ఫ్యాన్స్ మీటింగ్ లకు వస్తారు, కానీ ఓట్లు వెయ్యరు అంటూ చాలా మీటింగ్ లలో పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి అలా జరగకుండా మీటింగ్ కు వచ్చే ప్రతి జనసైనికుడు ఓటు వేస్తారు అన్న నమ్మకాన్ని ఇప్పుడిప్పుడే కలిగిస్తున్నారు.

అయితే... పవన్ తీసుకునే ఒక నిర్ణయం వలన అది కూడా కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లి గెలుపు సాధిస్తే సీఎం ఎవరు కానున్నారు ?? ఈ విషయం పై ఇప్పుడే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే పవన్ టీడీపీ తో కలిసి పోటీ చేసి చంద్రబాబును సీఎం చేసే పని అయితే జనసైనికులు ఇంతలా కష్టపడడం ఎందుకు ? చంద్రబాబును ఇంతకు ముందు సీఎం గా చూసేశాము.. టీడీపీ జనసేన తరపున సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటిస్తే జనసైనికులు ఓట్లు వేస్తారు, లేదంటే కనీసం పవన్ ఎమ్మెల్యే అవడం కూడా కష్టమే అన్నది రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్. మరి ఈ విషయంలో పవన్ చంద్రబాబు లు ఈ నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: