నరేంద్రమోడీతో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో తేడా కనబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యాక్యూమ్ బాగా పెరిగిపోయిందట. ఆ ఖాళీని పూరించే శక్తి తెలుగుదేశంపార్టీకి లేదని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కుండబద్దలు కొట్టేశారు. కాబట్టి మూడో ప్రత్యామ్నాయం ఆవిర్భవించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఆ మూడో ప్రత్యామ్నాయమే బీజేపీ-జనసేన కూటమన్నట్లుగా చెప్పారు.





ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని విశ్రాంత ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు రాసిన కథనాన్ని బొలిశెట్టి తన ట్విట్టర్ వేదికపై పంచుకున్నారు. 1983లో తెలుగుదేశంపార్టీని స్ధాపించి ఎన్టీయార్ రాజకీయాల్లో మార్పుతెచ్చిన విషయాన్ని బొలిశెట్టి గుర్తుచేశారు. 40 ఏళ్ళ తర్వాత పవన్ కల్యాణ్ కూడా జనసేనను అలాగే స్ధాపించారని చెప్పారు. అంటే బొలిశెట్టి ఉద్దేశ్యంలో ఎన్టీయార్-పవన్ ఒకటే అని చెప్పటం. జనసేన తరపున పవన్ ఎవరిని నిలబెడితే వాళ్ళకి ఓట్లేసి గెలిపించటానికి జనాలు సిద్ధంగా ఉన్నారని చెప్పటమే మరీ ఓవర్ గా ఉంది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీకి దూరంగా ఉండాలని పవన్ నిర్ణయించినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే మూడురోజుల నుండి టీడీపీలోని లోపాలను జనసేన నేతలు తమ ట్విట్టర్ ఖాతాల్లో ఎత్తిచూపుతున్నారు. టీడీపీ పనైపోయిందంటు ఒకటే ఊదరగొడుతున్నారు. పవన్ కు వ్యతిరేకంగా సీపీఐ సెక్రటరి రామకృష్ణ, కొందరు విశ్లేషకులను టీడీపీ ఉసిగొల్పుతున్నట్లుంది. మొన్నటివరకు చంద్రబాబు, పవన్ బ్రహ్మాండమని చెప్పిన వీళ్ళే ఇపుడు పవన్ పై దండెత్తుతున్నారు.






అయితే చంద్రబాబు కానీ తమ్ముళ్ళు కానీ ఎక్కడా పవన్ కు వ్యతిరేకంగా నోరిప్పటంలేదు. ఇదే విధానాన్ని పవన్ కూడా అనుసరిస్తునట్లున్నారు. టీడీపీ పనైపోయిందని, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని తాను మాట్లాడకుండా తన పార్టీలోని నేతలతో పవన్ చెప్పిస్తున్నారు. తాజా పరిణామాలతో రాష్ట్రంలో పొలిటికల్ వ్యాక్యూమ్ సంగతేమో కానీ టీడీపీ-జనసేన మధ్య మాత్రం గ్యాప్ పెరుగుతోందని అర్ధమవుతోంది. చివరకు ఇదెక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: