జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు కాపు సంక్షేమ సేన కరెక్టు ఫిట్టింగ్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే టీడీపీ+జనసేన పార్టీలు పొత్తుపెట్టుకోవాలని ఆకాంక్షించింది. అయితే పవన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలన్నదే తమ డిమాండుగా సంక్షేమ సేన వినిపించింది. పవన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తేనే టీడీపీ-జనసేన పొత్తుకు సేన మద్దతిస్తుందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య స్పష్టంగా ప్రకటించారు.






నిజానికి కాపుల్లో మెజారిటి టీడీపీ-జనసేన పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు, పవన్ పొత్తు పెట్టుకోవాలంటే అందుకు పవన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని చాలామంది అనుకుంటున్నారు. ఈ విషయం కాపుసంఘాలు, ప్రముఖుల మధ్య చర్చ జరుగుతోంది. పవన్ను గనుక సీఎం అభ్యర్ధిగా ప్రకటించకపోతే పొత్తును వ్యతిరేకించాలని కూడా కాపు ప్రముఖులు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. పవన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించకపోతే చంద్రబాబు పల్లకీని మోయాల్సిన అవసరం కాపులకు లేదనే భావనలో ఉన్నారు.





వచ్చేఎన్నికల్లో కాపుల తరపున పవన్ సీఎం కాకపోతే ఇక భవిష్యత్తులో అవకాశం వస్తుందో రాదో అని కాపు సామాజికవర్గం ఆందోళన పడుతోంది. కాపుల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ, కాపుల మనోభావాలనే జోగయ్య వినిపించారు. మరి జోగయ్య డిమాండుకు భిన్నంగా రెండుపార్టీలు పొత్తు పెట్టుకుంటే కాపులు ఏమిచేస్తారు అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. ఉభయగోదావరి జిల్లాలు, కోస్తా జిల్లాల్లో కమ్మలు-కాపులకు పెద్దగా సఖ్యతలేదు.





పవన్ను సీఎంగా చేయటానికి చంద్రబాబు సుముఖంగా ఉంటారా అన్నది పాయింట్. ఎందుకంటే ఈ రెండుపార్టీలు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా పవన్ కు కుర్చీని అప్పగించేసి చంద్రబాబు చూస్తూ ఊరుకుంటారా ? వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వచ్చేసి ఫైనల్ గా ముఖ్యమంత్రి అయిపోవాలన్నదే చంద్రబాబు టార్గెట్. ముందు తాను సీఎం అయిపోయి తర్వాత పరిస్ధితులను బట్టి ఆ కుర్చీలో లోకేష్ ను కూర్చోబెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు టీడీపీలో టాక్. అలాంటిది ముఖ్యమంత్రి పదవిని పవన్ కు చంద్రబాబు అప్పగిస్తారని ఎవరూ అనుకోవటంలేదు. అసలు సీఎం అవ్వాలని పవన్ కే ఉన్నట్లు లేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.   



మరింత సమాచారం తెలుసుకోండి: