ఎవరు అంగీకరించకపోయినా ప్రస్తుత రాజకీయమంతా కులాల చూట్టే ప్రదక్షిణలు చేస్తోందన్నది వాస్తవం.  అందుకనే వార్డులో పంచాయితి మెంబర్ ఎంపిక నుండి పార్లమెంటు టికెట్ వరకు అన్నీ పార్టీలు కులాల ప్రాతిపదికగానే కేటాయిస్తున్నాయి. దీన్నే ముద్దుగా కొంతమంది సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. ఈ సోషల్ ఇంజనీరింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే దీనిపైన బాగా దృష్టిపెట్టడంతో 2019 ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయం సాధ్యమైంది.





సరే ఇక ప్రస్తుత విషయానికి కొందరు రెడ్లు అంగీకరించకపోయినా సీఎం హోదాలో  రెడ్డి సామాజికవర్గానికి జగన్ ఉన్నారు. అలాగే కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబునాయుడున్నారు. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు పలానా నేతంటు ఎవరు లేరు. కాబట్టే బీసీలను ఉద్దరించేది తామే అంటే కాదు కాదు తామే అని జగన్, చంద్రబాబు పోటీ పడుతున్నారు. మరి బీసీల తర్వాత అత్యధిక జనాభా అంటే సుమారు 19 శాతం ఉన్న కాపుల పరిస్ధితి ఏమిటి ?





నిజానికి వైసీపీ తరపున జగన్, టీడీపీ తరపున చంద్రబాబు ఉన్నపుడు కాపుల తరపున ఎవరు ? ఈ ప్రశ్నకు సమాధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనే అనుకున్నారు. కానీ పవన్ వైఖరి చూసిన తర్వాత మెజారిటి కాపుల్లోనే అయోమయం పెరిగిపోతోంది. కాపులందరినీ ఏకతాటిపైకి తెచ్చేంత సీన్ పవన్ కు లేదని అర్ధమైపోయింది. దాంతో వెంటనే కాపుల ఓట్లకోసం జగన్, చంద్రబాబుతో పాటు చివరకు బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.





నిజంగానే పవన్ గనుక నిఖార్సయిన రాజకీయం చేస్తుంటే కాపుల ఓట్లకోసం మరో పార్టీ కన్నెత్తి కూడా చూసే అవకాశం ఉండేదికాదు. అలాంటిది స్వయంగా కాపు అయిన పవన్ కే కాపుల ఓట్లు పడతాయనే నమ్మకం లేదు. అందుకనే కాపులను తామే కాపు కాస్తామంటు జగన్, చంద్రబాబు, కేసీయార్ హామీలిస్తున్నారు. కాపుల ఓట్లకోసం ఇన్నిపార్టీలు ప్రయత్నిస్తున్నాయంటేనే పవన్ ఫెయిల్యూర్ అయ్యారనేందుకు ఇంతకు మించి నిదర్శనం ఏమికావాలి ?

మరింత సమాచారం తెలుసుకోండి: