ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే చాన్స్ దొర్కడం అంతా ఈజీ కాదు.అలాంటి గొప్ప అవకాశాన్ని కోల్పోయాడో లీడర్. కేవలం చెప్పిన టైమ్ కు వెళ్లని కారణంగా ఆయన టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన 1983 ఎన్నికల్లో జరిగింది. 1982లో టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్.. 1983లో పార్టీ పోటీ చేసిన తొలి ఎన్నికల్లో బోధన్నుంచి మైనారిటీ వర్గానికి చెందిన న్యాయవాది నియామతుల్లాఖాన్కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఖాన్ ఇంటికి టీడీపీ ఆఫీస్ నుంచి రాత్రి 9 గంటలకు సమాచారం వచ్చింది. తెల్లారి 4:30 గంటలకు హైదరాబాద్ గండిపేటలోని కుటీరానికి (ఎన్టీఆర్రాజకీయ వ్యవహారాల కోసం ఏర్పాటు చేసినది) రావాలని చెప్పారు. రవాణా, సమాచార సౌలత్లు అంతంత మాత్రమే ఉన్న రోజులవి. నియామతుల్లా ఖాన్టికెట్ ఖరారైన విషయం ఫ్రెండ్స్కు చెప్పారు. స్నేహితులు అభినందించి పార్టీ చేశారు. కుటీరానికి వెళ్లేందుకు కారు రెడీ చేశారు. ఎవరెవరు వెళ్లాలో నిర్ణయించారు.


అయితే మబ్బుల 4:30 గంటలకు అందుబాటులో ఉండాలని వచ్చిన సమాచారాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆ టైమ్ లో ఎవరూ ఉండరని చర్చించుకున్న ఫ్రెండ్స్.. ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ చేరుకునేలా ప్లాన్ చేశారు. తీరా అక్కడికి వెళ్లేసరికి మబ్బుల 4 గంటల నుంచే టికెట్ ఖరారైన అభ్యర్థులకు ఎన్టీఆర్ బీఫామ్స్ అందిస్తున్నారని తెలిసింది. నియామతుల్లా వెంటనే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి తన గురించి చెప్పగా.. 'నాలుగున్నరకు రమ్మంటే రెండు గంటలు ఆలస్యంగా రావడమేమిటి బ్రదర్' అంటూ కోప్పడ్డారు. టైమ్ పాటించని వారికి తన దగ్గర స్థానం లేదంటూ తిప్పి పంపించేశారు. ఆ నియోజకవర్గానికి సెకండ్ ప్రయారిటీగా పరిశీలించిన డి.సాంబశివరావు చౌదరి పేరును నియామతుల్లాఖాన్సమక్షంలోనే ప్రకటించి ఆయనకు బీఫామ్ అందజేశారు. ఆ ఎన్నికల్లో సాంబశివరావు చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో టీడీపీ భారీ విజయం సాధించి, ఎన్టీఆర్ సీఎం అయ్యారు. నిర్లక్ష్యంతో టైమ్ కు వెళ్లని కారణంగా ఎమ్యెల్యే అయ్యే చాన్స్ను కోల్పోయానని నియామతుల్లాఖాన్ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం 80 ఏండ్ల వయసున్న ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి: