
సుదీర్ఘకాలంగా దేశాన్ని పాలించి బేకారీ హఠావో…గరీభీ హఠావో..అనే నినాదాన్ని ఇచ్చినా కాంగ్రెస్ హయాంలో పేదరికంలో ఎటువంటి మార్పు రాలేదని రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తుంటారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక 13.50 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని ప్రపంచ బ్యాంకు నివేదించింది. ప్రస్తుతం 85 కోట్ల మంది భారతీయులు ఉచితంగా భోజనం చేస్తున్నారు. అంటే వీరికి ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రధానులు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ చేసినటువంటి పనులనే రాహుల్ గాంధీ చేస్తున్నారంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఇప్పుడు ఆయన జనాల్లో తిరుగుతూ బండ్లపై ప్రయాణిస్తూ వాళ్ల బాగోగులు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంలో కుల గణన గురించి ప్రస్తావిస్తారు. వాస్తవానికి ఆంధ్రాలో ఉన్న కొంతమంది కాపులకు తెలంగాణలో రిజర్వేషన్లు లేవు. తెలంగాణలో బీసీలుగా ఉన్నవారికి ఆంధ్రాలో రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లలో ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి సంబంధం లేదు.
కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కులగణన చేపట్టాలి. జాతీయ ప్రభుత్వానికి సాధ్యం కాదు. కొత్త పార్లమెంట్ మోదీ మల్టీ ప్లెక్స్ అంటూ జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఇది ఒక్క బీజేపీ ఎంపీలకు మాత్రమే కాదని భారతీయ ఎంపీలందరి పార్లమెంట్ అని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటివరకు బ్రిటీష్ ప్రభుత్వం కట్టిన పార్లమెంట్ లో ఉన్నాం. స్వాభిమానంతో భారత ప్రభుత్వం కట్టిన పార్లమెంట్ను స్వాగతించాలి కానీ ఇలా వ్యతిరేకించడం ఏంటని బీజేపీ మద్దతుదారులు పేర్కొంటున్నారు.