
మొత్తానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు నిప్పని ఎల్లోమీడియా సర్టిఫికేట్ ఇచ్చేసింది. ‘ఏది న్యాయం’ పేరుతో రాసిన కొ(చె)త్తపలుకులో చంద్రబాబు నిప్పులాంటి వాడని తీర్పిచ్చేసింది. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి విస్తరించుకున్న వ్యాపార సామ్రాజ్యం లాగ మరే ముఖ్యమంత్రి కొడుకులు విస్తరించలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. ఎన్టీయార్ హయాంను కూడా కలుపుకుంటే నందమూరి, నారా కుటుంబాలు దాదాపు 20 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏలినా రెండు కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నట్లు కానీ, అవినీతికి పాల్పడినట్లు కానీ ఎక్కడా ఒక్క ఆరోపణ కూడ లేదట.
ఎల్లోమీడియా చెప్పినట్లుగా ఎన్టీయార్ కుటుంబం మీద ఆరోపణలు లేవు. కానీ నారావారి గురించి రాసిందంతా పూర్తి అబద్ధం. అత్యంత అవినీతిపరులైన రాజకీయ నేతల్లో చంద్రబాబునాయుడు కూడా ఒకళ్ళని చాలా కాలం క్రితమే తెహల్కా డా. కామ్ తేల్చిచెప్పింది. తనకు వ్యతిరేకంగా దాఖలైన అవినీతి కేసుల్లో విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు నిప్పని చెబుతున్న ఎల్లోమీడియా ‘ఓటుకునోటు’ కేసులో సూత్రదారి ఎవరో చెబితే బాగుంటుంది.
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబుకు హెరిటేజ్ సంస్ధ తప్ప మరోటిలేదని సర్టిఫికేట్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. 30 ఏళ్ళక్రితమే భువనేశ్వరి కార్బైడ్స్ ను పెట్టి నష్టాల్లో కూరుకుపోతే అమ్మేసిందెవరో ఎల్లోమీడియాకు తెలీదా ? 30 ఏళ్ళ క్రితమే తిరుపతిలో స్టార్ హోటల్ కట్టి నష్టాలొస్తున్నాయని అమ్మేసిందెవరు ? అసలు హెరిటేజ్ సంస్ధ ఈ స్ధాయిలో ఉందంటే అందుకు చిత్తూరుతో పాటు ప్రభుత్వ డైరీలను నాశనం చేసిందెవరు ?
అవినాష్ రెడ్డి విషయంలో ఒకలాగ, జగన్ కేసుల్లో మరోలాగ వ్యవహరిస్తున్న కోర్టులు చంద్రబాబు విషయంలో మాత్రం ఇంకోలాగ ఎందుకు వ్యవహరిస్తున్నాయో అర్ధంకావటంలేదట. అవినాష్ కేసులో ముందస్తు బెయిల్ వచ్చిందంటే హైకోర్టు విచారణలో సీబీఐ వాదనలోని డొల్లతనం బయటపడింది. అవినాష్ అరెస్టు విషయంలో జడ్జి అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సీబీఐ సరైన సమాధానం చెప్పలేకపోయింది. పైగా అవినాష్ అరెస్టుకు ముందు తాము అనుకున్న గూగుల్ టేకవుట్ పరిజ్ఞానం తప్పని సీబీఐ అధికారులే అంగీకరించారు.
ఇక ఆదాయానికి మించిన కేసుల్లో జగన్ 16 మాసాలు జైలులో ఉండి బెయిల్ తెచ్చుకుని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు కోర్టుల్లో పోరాడుతున్నారు. జగన్ కేసుల్లో అరెస్టయిన చాలామంది మీద నమోదైన కేసులను కోర్టులు కొట్టేస్తున్నాయి. అధికార దుర్వినియోగంచేసి జగన్ అవినీతికి పాల్పడ్డారనేందుకు సీబీఐ ఇంతవరకు ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపించలేకపోయింది. ఎందుకంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు ప్రభుత్వంలో జగన్ ఒక్క పదవిలో కూడా లేరు.
కానీ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు సీఐడీ చాలా ఆధారాలను చూపించింది. స్కిల్ స్కామ్, రింగ్ స్కామ్, గ్రిడ్ స్కామ్ జరిగింది చంద్రబాబు సీఎంగా ఉన్నపుడే. అన్నింటికీ బాధ్యత వహించాల్సింది చంద్రబాబే. అందుకనే మంత్రిగా పనిచేసిన లోకేష్ తో పాటు హెరిటేజ సంస్ధపైన కూడా సీఐడీ కేసులు నమోదుచేసింది. చంద్రబాబు నిప్పని ఎల్లోమీడియా తేల్చేస్తే సరిపోదు అవన్నీ కోర్టుల్లో నిరూపితమవ్వాలి.