ముఖ్యమంత్రి పదవికోసం రేవంత్ రెడ్డితో పాటు గట్టిగా ప్రయత్నించిన భట్టీ విక్రమార్కకు తీవ్ర నిరాస తప్పలేదు. వాస్తవానికి తాను సీనియర్ అని, పార్టీలో మొదటినుండి ఉన్నానని, ప్రతిపక్షంలో ఉన్నపుడు సీఎల్పీ నేతగా పనిచేసినట్లు చెప్పుకోవటం తప్ప భట్టీకి వేరే అర్హత లేదు. మొన్నటి ఎన్నికల్లో తన నియోజకవర్గం మధిరలో తప్ప ఇంకెక్కడా ప్రచారం చేయలేదు. అదే రేవంత్ ను తీసుకుంటే సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీచేసారు.





ఈ రెండు నియోజకవర్గాలతో పాటు అదనంగా సుమారు 80 నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం చేశారు. రేవంత్ కున్న వాగ్దాటి, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటి, జనాకర్షణ భట్టీకి లేవనే చెప్పాలి. గెలిచిన ఎంఎల్ఏల్లో మెజారిటి రేవంత్ కు మద్దతుగా నిలబడటంతోనే తనకున్న ఫాలోయింగ్ ఏమిటో తెలిసిపోతోంది. ఇలాంటి రేవంత్ తో సీఎం పోస్టుకు పోటీపడటమే భట్టీ చేసిన తప్పు.  పదవులు వచ్చి తమంతట తాము వరించాలే కానీ ప్రయత్నంచేసుకుంటే రావని భట్టి ఇంకా తెలుసుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.





ప్రయత్నం లేకుండానే పీవీ నర్పింహారావు, కొణిజేటి రోశయ్యలకు పదవులు వచ్చిన విషయం తెలిసిందే. సరే ఇక విషయానికి వస్తే ముఖ్యమంత్రిగా  రేవంత్ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. మరిపుడు భట్టి ఏమిచేస్తారు ? డిప్యూటి సీఎంగా మంత్రివర్గంలో ఉంటారా ? లేకపోతే పీసీసీ పగ్గాలు అందుకుంటారా ? పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే భట్టీకి డిప్యూటి సీఎంతో పాటు పార్టీ అధ్యక్షపగ్గాలు అప్పగిస్తామని అధిష్టానం ఆఫరిచ్చిందట. రెండు పదవులను తీసుకోమని అధిష్టానం ఎంత నచ్చచెప్పినా భట్టీ మాత్రం ఏ విషయం తేల్చలేదట.





నిజానికి పేరుకు డిప్యూటీ సీఎం అనే ఉంటుంది కానీ మంత్రికి అదనంగా ఏ అధికారం ఉండదు. కాకపోతే ప్రోటోకాల్ మత్రమే కాస్త ఎక్కువగా ఉంటుందంతే. ఈ విషయం దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉన్న భట్టీకి తెలీకుండా ఉండదు. కాబట్టి అధిష్టానం ఇచ్చిన డిప్యూటీ సీఎం+పీసీసీ ప్రెసిడెంట్ అనే ఆఫర్ ను తీసుకుంటారా లేకపోతే తిరస్కరిస్తారా అన్నది సస్పెన్సుగా  మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: