నిన్న జరిగిన ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి బీజేడీ సీనియర్ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరయ్యారు. 24 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన పట్నాయక్ హాజరు కావడం ద్వారా తన గొప్ప మనసును చాటుకున్నారు. సాధారణంగా ఓడిపోయిన ముఖ్యమంత్రి వేరే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రారు. కానీ ఈయన ఆ కార్యక్రమానికి సంతోషంగా హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచారు. సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత ఒడిశాలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ, ఆయన ఫ్రెండ్లీ నేచర్ కి ఫిదా అయిపోయింది. పట్నాయక్‌కు వేదికపై ఘనస్వాగతం పలికింది.

ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ బీజేపీ చేతిలో ఓడిపోయింది. బుధవారం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించేందుకు కొత్త ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్వయంగా నవీన్ పట్నాయక్ ఇంటికి వెళ్లారు.  ఎన్నికల సమయంలో బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించినా నవీన్ మాత్రం సంతోషంగా ఆహ్వానాన్ని మన్నించి రాజకీయాలు పక్కనబెట్టారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా నవీన్ పట్నాయక్ విధానాలను విమర్శిస్తూ ఆయన ఆరోగ్యంపై వ్యాఖ్యానించారు. అయితే, నవీన్ రాజకీయ విషయాలను నేర్పుగా నిర్వహించారు. ఎప్పుడూ అతిగా స్పందించలేదు. బీజేపీ చేతిలో ఓడిపోవడంతో ఓటమిని అంగీకరించి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు.ప్రమాణ స్వీకారోత్సవంలో నవీన్ పట్నాయక్‌కు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోదీ వేదికపై ఆయనతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. వారి ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నవీన్ పట్నాయక్ దయగల ప్రవర్తనను ప్రతిచోటా ప్రజలు ప్రశంసిస్తున్నారు.

నేటి రాజకీయాల్లో నాయకులు మళ్లీ అధికారంలోకి రాగానే ప్రతీకారం తీర్చుకోవడం సర్వసాధారణం.  అయితే, నవీన్ పట్నాయక్ వేరే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆదర్శంగా నిలుస్తుంది. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించేందుకు చంద్రబాబు నాయుడు స్వయంగా జగన్‌కు ఫోన్ చేశారని, అయితే జగన్ స్పందించలేదని వార్తలు వచ్చాయి. జగన్ ఇకనైనా మారాలి అని, ఇలాంటి నేతల నుంచి మంచి నేర్చుకోవాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: