
కేసీఆర్ చుట్టూ అదృశ్య శక్తులున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు, ఆపై ఆమె రాసినట్లుగా ప్రచారంలో ఉన్న లేఖ వ్యవహారం ఇంకా చల్లారకముందే, ఆమె అత్యంత సన్నిహితుడొకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్, ఈ నిప్పుకు ఆజ్యం పోసినట్లయింది.
కవిత విధేయుడి పోస్టులో కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను అంతర్గతంగానే చర్చించుకోవాలని హితవు పలికిన కేటీఆర్, మరి కవిత లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పాలని, పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడింది ఎవరో తేల్చాలని సదరు పోస్టు నిలదీసింది.
సొంత చెల్లెలిపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తే, పార్టీ అధినాయకత్వం, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ఘాటుగా ప్రశ్నించింది. బీఆర్ఎస్ ప్రజాస్వామ్య పార్టీ అని, అందరికీ సమాన అవకాశాలు, స్వేచ్ఛ ఉంటాయని చెప్పే కేటీఆర్, కవిత విషయంలో ఆ సమన్యాయం ఎక్కడ పోయిందని సూటిగా అడిగింది.
కేటీఆర్, హరీష్ రావులపై చిన్న ఆరోపణ వచ్చినా కేసులు పెట్టడానికి ఉరుకులు పరుగులు పెట్టే పార్టీ యంత్రాంగం, కవిత విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని, ఇది పెద్దలకే రక్షణ కల్పించలేని దుస్థితి అయితే, సామాన్య కార్యకర్తల గతేంటని ఆ పోస్టు ఆవేదన వ్యక్తం చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు ఎలాంటి బాధ్యతలు లేవా అని ప్రశ్నిస్తూ, కుట్రలు చేసేవారిని, అంతర్గత విషయాలను బయటపెట్టేవారిని వదిలేసి, బాధితురాలైన కవితను నిందించడంలో కేటీఆర్ ఆంతర్యమేమిటని నిగ్గదీసింది.
"కేటీఆర్ గారు మీరు చాలా హుషారుగా ఉన్నారు. పార్టీ ఏమైనా మీ జాగీరా? గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారా? అక్కకు ఈ పార్టీలో హక్కులు లేవా?" అంటూ సంధించిన వాగ్బాణాలు, గులాబీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ పోస్టును 'తెలంగాణ విత్ కవితక్క', 'వుయ్ స్టాండ్ విత్ కవితక్క' హ్యాష్‌ట్యాగ్‌లతో ఉద్యమకారులకు, కవిత సన్నిహితులకు విస్తృతంగా సర్క్యులేట్ చేయడం గమనార్హం.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనం వహించడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. కవిత ఆరోపణలు, లేఖల వ్యవహారంపై ఆయన ఇప్పటివరకు పెదవి విప్పకపోవడం, పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అసలు కేసీఆర్, కవితను పిలిచి మాట్లాడతారా, లేక ఈ దూరం మరింత పెరుగుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
గతంలో 'సామాజిక తెలంగాణ' అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తనతో విభేదించే వారిని ఆయన ఏమాత్రం సహించరని, అలాంటి వారి ముఖం చూడటానికి కూడా ఇష్టపడరని కేసీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బహుశా కవిత విషయంలో కూడా కేసీఆర్ అదే వైఖరి అవలంబిస్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
కొన్నిసార్లు కేసీఆర్ వేచి చూసే ధోరణి అవలంబిస్తారని, తొందరపడి స్పందించి అనవసర ప్రచారం కల్పించడం ఆయనకు ఇష్టం ఉండదని, వారిని ప్రజల్లో పెద్దవాళ్లను చేసినట్లు అవుతుందనేది ఆయన ఆలోచనా విధానమని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. శనివారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్, కేటీఆర్ సుదీర్ఘంగా భేటీ కావడం, పార్టీలోని భిన్నాభిప్రాయాలపై తొందరపడి స్పందించవద్దని కేసీఆర్, కేటీఆర్‌కు సూచించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇంటి గుట్టు రచ్చకెక్కిందని, దీనిని త్వరగా పరిష్కరించకపోతే విపక్షాలకు బలమైన అస్త్రం అందించినట్లేనని బీఆర్ఎస్ సీనియర్లు మథనపడుతున్నారు. కవిత అంశానికి ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పెట్టకపోతే, అధికార, విపక్షాలు ఈ అంశాన్ని ఓ సీరియల్‌లా సాగదీసి పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని కవిత చెబుతున్నప్పటికీ, ఆమె వ్యవహారశైలి చూస్తుంటే పార్టీలో కొనసాగడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.