సినీ తారలకే కాదు రాజకీయ నాయకులకు కూడా అభిమానులు ఉంటారు. అయితే అభిమానులు ఒక్కోసారి చేసే అతి పనులు వెగుటుగా ఉంటాయి. అటువంటి ఘటనే ఒక‌టి తెర‌పైకి వచ్చింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వీరాభిమాని ఒకరు తాజాగా అరగుండు గీయించుకున్నాడు. అసలు అరగుండు ఎందుకు గీయించుకున్నాడో తెలిస్తే షాక్ అయిపోతారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్లలో నివాసం ఉంటున్న వీర‌వ‌ల్లి శివ‌రామ‌కృష్ణ అలియాస్‌ శివ.. వైఎస్ జగన్ కు వీరాభిమాని. గతంలో కొవ్వూరు నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియాకు కన్వీనర్ గా పనిచేసిన అనుభవం కూడా శివకు ఉంది.


అయితే గత ఏడాది ఎన్నికలకు ముందు జగన్ అండ్ కో మళ్లీ తామే అధికారంలోకి వస్తానని గుడ్డి నమ్మకంతో ఉన్నారు. వైనాట్ 175 అనే నినాదంతో త‌మ ధీమా వ్యక్తం చేశారు. కానీ ప్రజలు వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్షం కూడా ద‌క్క‌కుండా చేశారు. అయితే ఎన్నికలకు ముందు వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని.. రెండోసారి జగన్ సీఎం అవ్వ‌డం ఖాయమంటూ శివ త‌న‌ స్నేహితుడుతో పందెం కాశాడు. ఒక‌వేళ‌ అలా జరగని పక్షంలో అరగుండు గీయించుకుంటానంటూ ఛాలెంజ్ కూడా చేశాడు.


క‌ట్ చేస్తే కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటీవ‌లె ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంది. దీంతో కొద్ది రోజుల క్రితం పందెం గురించి స్నేహితులు ప్ర‌శ్నించ‌గా.. శివ ఇచ్చిన మాట ప్ర‌కారం అర‌గుండు గీయించుకున్నాడు. పైగా ఈనెల 25న ఆదివారం సాయంత్రం ఉనగట్ల సెంటర్‌లో అరగుండుతో తిరుగాడు. అక్క‌డితో ఆగ‌కుండా సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను కూడా పంచుకున్నాడు. జ‌గ‌న్‌ను తాను దైవంగా భావిన్నాను.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌నే మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తార‌ని న‌మ్మి పందెం క‌ట్టాను. కానీ వైసీపీ ఓడిపోయింది. ఆ బాధ నుంచి కోలుకోవ‌డానికి నాలుగు నెల‌లు ప‌ట్టింది. ఇచ్చిన మాట ప్ర‌కారం అర‌గుండు గీయించుకున్నాను. మాట నిల‌బెట్టుకున్నందుకు చాలా గ‌ర్వంగా ఉంది అంటూ శివ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో వైర‌ల్ గా మార‌డంతో నెటిజ‌న్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మాట నిలబెట్టుకున్నందుకు కొంద‌రు శివ‌ను అభినందిస్తున్నా.. మ‌రికొంద‌రు మాత్రం `మ‌రీ ఇంత పిచ్చేంట్రా నీకు` అంటూ విమ‌ర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: