ప్రస్తుతం దేశ రాజకీయాల్లో జరిగే పరిణామాలను గమనిస్తే, ఓ స్పష్టమైన దిశలో కథ నడుస్తోంది. కేంద్రంలో గత పదకొండు సంవత్సరాలుగా ఎన్డీయే పరిపాలన కొనసాగుతుండగా, ప్రధాని మోడీ అనంతరం వారసత్వ హక్కుతో ముందుకు వచ్చే వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకు చాలా సమాధానాలు చెబుతున్నా, ఒకే పేరు గట్టిగా వినిపిస్తోంది - అమిత్ షా. బీజేపీలో నెంబర్ 2 స్థాయిలో ఉన్న ఆయన, కేబినెట్‌లో అత్యంత శక్తివంతమైన హోంమంత్రిగా కొనసాగుతున్నారు. రాజకీయంగా చూస్తే, ఆయన పాత్ర నేడు పార్టీలోనే కాదు - పాలనలో కూడా కీలకంగా మారింది. వాజ్‌పేయి-అద్వానీ కాలంలో ఎలా దూసుకెళ్లిందో బీజేపీ, అదే బాటలో మోడీ-అమిత్ షా ద్వయం ఇప్పుడు పార్టీని దశ దిశలుగా విస్తరించింది. 2029లో మోడీ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అప్పుడు ఆయన వయస్సు ఎనభై దాటుతుంది. రాజకీయంగా విరమించుకునే వయస్సే. అలాంటప్పుడు ఖాళీ అవుతున్న ప్రధాని పీఠాన్ని ఎవరూ? అనే ప్రశ్నకు వేరే సమాధానం కాకుండా అమిత్ షానే అనే చర్చ ఉధృతమవుతోంది.


మోడీ తరువాత నాయకత్వ బాధ్యతలు ఎవరు భరించగలరు ? ఎవరి చేతుల్లో పార్టీ భవిష్యత్తు బాగుంటుంది ? అనే రెండు కీలక అంశాలకు సమాధానం - మోడీనే గట్టిగా నమ్ముతున్న వ్యక్తి - అమిత్ షా. అయితే, ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊపు ఇచ్చాయి. సహకార సంఘాల మహిళా ప్రతినిధుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు. "రాజకీయాల తర్వాత వ్యవసాయం చేస్తాను. వేదాలు, ఉపనిషత్తులు చదువుతూ ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతాను" అని చెప్పారు. రాజకీయంగా చూస్తే ఇది విరుద్ధంగా అనిపించొచ్చు. ఎందుకంటే అమిత్ షా ఇంకా రాజకీయంగా అత్యంత కీలక స్థాయిలో ఉన్నారు. పదవీ విరమణ వయస్సు దూరంగా ఉంది. మరి ఇలాంటి వ్యాఖ్యల మిగిలిన అర్థం ఏమిటి? విశ్లేషకుల దృష్టిలో ఇది ఓ సంకేతం. రిటైర్మెంట్ ప్రస్తావన ఇప్పుడే రావడం వెనుక ఒక అభిప్రాయం - "ముందుగా నా లక్ష్యాలు సాధించుకుంటాను, ఆ తరువాతే విశ్రాంతి తీసుకుంటాను" అనే సంకేతంగా కనిపిస్తోంది.


మోడీ రిటైర్మెంట్ తరువాత వచ్చే నాయకత్వ బాధ్యతలను పూర్తిగా భుజాలపై వేసుకొని, దేశానికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకా బీజేపీలో నితిన్ గడ్కరీ లాంటి నేతల పేర్లు కూడా ప్రధానమంత్రి పదవికి అనర్హమని చెప్పలేము. కానీ పార్టీ ధోరణిని చూస్తే- మోడీ తర్వాత జెండా పట్టేది అమిత్ షా అనే అభిప్రాయం బలంగా ఉంది. మోడీ-షా ద్వయం ఎంత సమన్వయంతో పని చేస్తుందో, బీజేపీ అంత శక్తివంతంగా వ్యవస్థీకృతమైంది. అలాంటి వేళ, దేశానికి ప్రధానిగా గుజరాత్ నుంచి మరోసారి నాయకుడు రావడం అనేది చరిత్ర పునరావృతం అవుతుందా? అనే ప్రశ్నను ముందుకు తెస్తోంది. మొత్తం మీద, మోడీ తర్వాత భారతదేశ ప్రధానిగా అమిత్ షా పేరు అత్యంత బలంగా వినిపిస్తోంది. రాజకీయ పరిణామాలు, బీజేపీ లోపల జోక్యాలు, ప్రజల మధ్య అభిప్రాయాల పరంగా - ఆయన ప్రధాని పీఠానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఇది ఊహాగానమా? లేక ముందుగా కనిపిస్తున్న ఈ విష‌యం పై.. కాలమే సమాధానం చెబుతుంది!


మరింత సమాచారం తెలుసుకోండి: