వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కే రోజా వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలపై, కూటమి ప్రభుత్వం విచారణ ఆదేశించింది. విజిలెన్స్ శాఖ తాజాగా సమర్పించిన నివేదికలో దాదాపు 40 కోట్ల రూపాయల మేర అక్రమాలు చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఈ నివేదిక వెలుగులోకి రావడంతో రోజాపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ చర్యలు అమలులోకి వస్తే, కూటమి ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా మాజీ మంత్రిపై నేరుగా చర్యలు తీసుకున్నట్లు అవుతుంది. ఈ అంశాన్ని వైసీపీ తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూస్తోంది.


రోజాపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, మహిళా నాయకురాలిని వేధించిందని ప్రచారం చేస్తూ, మహిళా ఓటర్లలో సానుభూతి సృష్టించుకోవాలనే యత్నం వైసీపీ వ్యూహంలో భాగమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా, ఈ వివాదం తమకు నేరుగా మైలేజ్ ఇస్తుందా లేదా అనేది పక్కనబెడితే, ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో భావోద్వేగాలను రేకెత్తించవచ్చని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ఈ విషయంపై కూటమిలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం, ముఖ్యంగా సీమ ప్రాంతానికి చెందిన మహిళా నాయకులు, రోజాపై వ్యక్తిగత స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారని, ఆమె అరెస్టు కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. అయితే, కూటమిలోని మరో కీలక పార్టీ మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తోంది.


రోజా సినీ నేపథ్యం ఉన్న ప్రజాదరణ కలిగిన వ్యక్తి కావడంతో, ఆమెపై తొందరపడి చర్యలు తీసుకోవడం ప్రతికూల ప్రభావం కలిగించవచ్చని వారు భావిస్తున్నారు. అదే సమయంలో, కేవలం 40 కోట్ల రూపాయల ఆరోపణలకే అరెస్టు చేస్తే, అవసరంలేని వివాదం రేగే అవకాశం ఉందని కొందరు కూటమి నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల, ప్రస్తుతానికి పరిస్థితిని పరిశీలించి, సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మరోవైపు, టీడీపీలో కూడా ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ కేసును తక్షణమే ముగించకుండా, రోజాను రాజకీయంగా కంట్రోల్ చేసే విధంగా వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికే రోజా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లారని, ఈ సమయంలో ఆమెపై చర్యలు తీసుకోవడం కన్నా, కొంతకాలం ఆమెను వ్యూహాత్మ‌కంగా కంట్రోల్ చేయ‌డం మంచిదని భావిస్తున్నారు. ఫైన‌ల్‌గా రోజాపై చర్యల విషయంలో కూటమి ప్రభుత్వం ఏ దిశలో అడుగులు వేస్తుందో.. అలాగే వైసీపీ ఈ అంశాన్ని ఎలా రాజకీయంగా మలుస్తుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: