
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకం అమలు చేసి 20 నెలలు గడిచినా మాధవీలత నోరు విప్పలేదు. కానీ చంద్రబాబు పథకం అమలు చేసిన వెంటనే విమర్శలు రావడం వెనక అసలు ఉద్దేశ్యం ఏమిటనేది చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఏపీలో బీజేపీ కోటా నుంచి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి పొందిన లంకా దినకర్ కూడా ఉచిత పథకాలపై ప్రశ్నలు సంధించారు. "మితిమీరిన ఉచిత పథకాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల తరహాలో ఆచరణ సాధ్యమైన పథకాలను మాత్రమే అమలు చేయాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ విషయమై ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇస్తానని చెప్పడం కూడా కూటమి సంబంధాల్లో కొత్త మలుపుకు దారితీస్తోంది. చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘స్త్రీశక్తి’ పథకంపై మిత్రపక్షం నుంచే విమర్శలు వినిపించడం టీడీపీ వర్గాల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది.
గతంలోనూ టీడీపీ – బీజేపీ కూటమి విభేదాల కారణంగా కూలిపోయింది. 2014-18 మధ్య బీజేపీ మద్దతు లేకపోవడంతో రాష్ట్రం నష్టపోయిందని టీడీపీ ఆరోపించింది. నాటి బీజేపీ నేత సోము వీర్రాజు కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసేలా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు మాధవీలత, లంకా దినకర్ వ్యాఖ్యలు ఆ జ్ఞాపకాలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. వైసీపీ మాత్రం ఈ వివాదంపై తన స్వరాన్ని పెంచుతోంది. "ఏడాదికి ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం కూడా ఆలస్యం అవుతోంది. హామీల అమలు లోపిస్తోంది" అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై దాడి చేస్తోంది. బీజేపీ నేతల తాజా వ్యాఖ్యలు కూడా విపక్షానికి బలం చేకూర్చేలా మారాయని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి, మాధవీలత–లంకా దినకర్ విమర్శలు కూటమి భవిష్యత్తుపై కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి.