ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం ఒంగోలు. మ‌రోసారి ఇక్క‌డి రాజ‌కీయాలు హాట్ టాపిక్ అయ్యాయి. సీనియ‌ర్ నేత‌, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డిని ఎవ‌రూ ఓన్ చేసుకోలేక పోతున్నారు. సుదీర్ఘ‌కాలం రాజ‌కీయాల్లో ఉన్న బాలినేని.. కాంగ్రెస్‌లోను.. త‌ర్వాత వైసీపీలోనూ చ‌క్రం తిప్పారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న సొంత‌గా అజెండా రూపొందించుకుని అమ‌లు చేశారు. గ‌త ఎన్నిక‌ల అనంత‌రం.. వైసీపీతో విభేదించి జ‌న‌సేన‌లోకి వ‌చ్చారు.


అయితే.. బాలినేనికిఉన్న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న ఎంట్రీని జీర్ణించుకోలేక పోతున్నారు. అస‌లు ఆ య‌న‌ను జ‌న‌సేన‌లోకి తీసుకునేముందు ఎవ‌రిని సంప్ర‌దించార‌న్న ప్ర‌శ్న‌లు కూడా లేవ‌నెత్తారు. అయితే.. పార్టీ అధినేత ప‌వ‌న్ మాత్రం.. బాలినేని అండ‌గా ఉన్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌వ‌న్ సూచ‌న‌లు, స‌ల‌హా లు.. బుజ్జ‌గింపులు ఏమాత్రం ప‌నిచేయ‌డం లేదు.  కూట‌మిలోని మూడు పార్టీల నాయ‌కులు కూడా బాలినేనికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హరిస్తున్నార‌న్న‌ది క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను చూస్తే అర్ధ‌మ‌వుతుంది.


పార్టీలో దూకుడుగా ప‌నిచేయాల‌ని బాలినేని భావిస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు క‌లిసి రాక‌పోవ‌డంతో ఆయ‌న‌కు చేతులు ఆడ‌డం లేదు. అంతేకాదు, మూడు పార్టీల నాయ‌కులు ఒకే గ‌ళం వినిపించ‌డం.. కామ న్ ప్ర‌త్య‌ర్థిగా బాలినేనిని చూడ‌డం ప్ర‌ధాన చ‌ర్చ‌కు దారితీసింది. ఇటీవ‌ల ఓ నాయ‌కుడికి నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌ను స‌న్మానించే కార్య‌క్ర‌మానికి టీడీపీ-జ‌న‌సేన నాయ‌కులు భారీ ఏర్పాట్లు చేశారు. నిలువెత్తుక‌టౌట్లు కూడా ఏర్పాటు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని అంద‌రి నాయ‌కుల ఫొటోల‌ను దీనిపై ముద్రించారు.


కానీ, ఎక్క‌డా చూద్దామ‌న్నా బాలినేని ఫొటో మ‌చ్చ‌కైనా క‌నిపించ‌లేదు. పైగా.. ఇలా చేయ‌డాన్ని నాయ‌కు లు స‌మ‌ర్థించుకున్నారు. ఈ వ్య‌వ‌హారంపై బాలినేని వ‌ర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. త్వ‌ర‌లోనే విశాఖ కేంద్రంగా జ‌న‌సేన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. దీనికి సంబంధించి రెండు క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ క‌మిటీల్లో బాలినేనికి చోటు క‌ల్పించొద్ద‌ని పేర్కొంటూ.. ఒంగోలుకు చెందిన ఓ నాయ‌కుడు లేఖ రాశారు. ఇది కూడా జ‌న‌సేన వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. మొత్తంగా చూస్తే.. ఒంగోలు రాజ‌కీయాల్లో బాలినేని ఒంట‌ర‌య్యార‌న్న‌ది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: