
ఈ క్రమంలోనే, ఇప్పుడు కేంద్రంలో లభించే నామినేటెడ్ పదవుల కోసం పురందేశ్వరి బలంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. బీజేపీ అగ్రనాయకత్వంతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుని, జాతీయ స్థాయిలో ఒక కీలక పదవి సాధించాలనే ఆలోచనలో ఆమె ఉన్నారట. ముఖ్యంగా, జాతీయ పార్టీ అధ్యక్షురాలి రేసులోనూ పురందేశ్వరి పేరు గతంలో వినిపించింది. తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్‌తో పాటు, ఆ స్థాయి మహిళా నాయకత్వానికి పురందేశ్వరి కూడా లైన్‌లో ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ ఆ చర్చ పుంజుకుంది. వచ్చే నెలలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిశాక, బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పురందేశ్వరి ఆ రేసులో ఉంటారని అనుకుంటున్నారు.
ఆ పదవి అందకపోతే, కనీసం ఒక నామినేటెడ్ పదవైనా దక్కించుకోవాలని పురందేశ్వరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాల్లో సమాచారం. పురందేశ్వరి అలకకు ప్రధాన కారణం, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆమెకు మద్దతుగా నిలవకపోవడమే అని పరిశీలకుల అభిప్రాయం. తాను కేంద్రంలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకున్నా, రాష్ట్ర స్థాయి నుంచి బలమైన సిఫార్సు లేకపోవడం ఆమెకు పెద్ద ఆటంకంగా మారింది. అయినప్పటికీ, జాతీయ స్థాయిలో బలమైన సంబంధాలున్న పురందేశ్వరి ఏదో ఒక పదవిని సాధించే అవకాశం ఉందని అంటున్నారు. చివరికి ఆమె ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి.