
కుమార్తె కవిత విషయంలోనే ఉదాహరణ :
లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లినప్పుడు కేసీఆర్ చూపిన నిర్లక్ష్యం అందరికీ షాక్ ఇచ్చింది. తన కూతురు జైలుకెళ్తే తండ్రిగా, నాయకుడిగా పక్కన నిలబడాల్సింది. కానీ ఆయన వెనక్కి అడుగు వేసారు. పరామర్శించలేదు, న్యాయపోరాటానికి గట్టి భరోసా ఇవ్వలేదు. ఇంతేకాదు, పార్టీ భవిష్యత్తులో కవిత పాత్ర ఏమిటి, ఏ స్థాయిలో ఉండాలో స్పష్టత ఇవ్వకపోవడం కూడా పెద్ద తప్పిదమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కవితతో పాటు నడిచిన కేసీఆర్… ఆ ప్రయత్నం విఫలమైన వెంటనే ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు. కేటీఆర్‌కి ప్రాధాన్యం ఇస్తూ సర్దిచెప్పలేకపోవడం బీఆర్ఎస్‌లో మరో పెద్ద గ్యాప్ సృష్టించింది.
ఇతరుల చేతుల్లో బందీలా? :
కవిత స్వయంగా చెప్పిన మాటలే దీనికి సాక్ష్యం. “నాన్నా… మీ చుట్టూ ఉన్న వాళ్ల గురించి తెలుసుకోండి” అంటూ కన్నీటి గాత్రంలో చేసిన విజ్ఞప్తి, కేసీఆర్ ఇపుడు కొంతమంది కోటరీల చేతుల్లో బందీ అయ్యారని బహిర్గతం చేసింది. ముఖ్యనేతల పేరుతో మీడియా బ్రేకింగ్‌లు వస్తున్నాయి కానీ, వాటి వెనక సంతోష్ రావు లాంటి క్లోజ్ సర్కిల్ వ్యక్తులే ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. అంటే కేసీఆర్ చుట్టూ ఒక గట్టి గోడ కట్టబడి, ఆయన ఆ గోడను చెరిపేసే శక్తి కోల్పోయినట్లే.
నాటి చాణక్యం ఎక్కడ? :
ఒకప్పుడు కేసీఆర్ ఇతర పార్టీలను చిన్నాభిన్నం చేసే వ్యూహకర్త. కాంగ్రెస్, టీడీపీ లాంటి జెయింట్స్ కూడా ఆయన ప్లాన్లను తట్టుకోలేక వెనకడుగు వేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఇతర పార్టీలు బీఆర్ఎస్‌ను బలహీనపరచడం లేదు, అంతర్గత గందరగోళమే పార్టీని కూల్చేస్తోంది. అయినా కేసీఆర్ మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇది ఆయన చాణక్యం గెలుపు సందర్భాల్లో మాత్రమే వెలుగులోకి వచ్చేదే కానీ, కష్టాలు వచ్చినప్పుడు ఏ పనికీ రాదన్న వాస్తవాన్ని బహిర్గతం చేస్తోంది. మొత్తానికి, చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్… తన సొంత కోటలోనే బందీగా మారిపోయిన నాయకుడిగా మారారన్న చర్చలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.