తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసినప్పటి నుంచి ప్రతి అడుగు తమిళనాడులో పెద్ద చర్చకే దారి తీస్తోంది. టీవీకే (తమిళ వెట్రిగ కళగం) పార్టీని స్థాపించి, 7 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో విజయ్ బరిలోకి దిగారు. కానీ శుక్రవారం (ఈరోజు) మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఇచ్చిన తీర్పు ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. కరూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో జరిగిన భారీ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం, వంద మందికి పైగా గాయపడటం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలం రేపింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన విజయ్, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే త్వరలోనే బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా పరామర్శించనున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ ఘటనలో రాజకీయ కుట్ర వాసన వస్తోందని విజయ్ గట్టిగా ఆరోపించారు. తాను బలంగా రాజకీయాల్లో అడుగుపెడుతున్న దశలోనే అధికార, విపక్షాలు కలిసి తాను అభాసుపాలు కావాలని ప్రయత్నించారని ఆయన అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం జరిపే విచారణలో నిజానిజాలు వెలుగులోకి రావని నమ్మిన విజయ్, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మధురై బెంచ్ ఈ పిటిషన్‌ను అనర్హంగా కొట్టివేసింది. ఘటనపై ఇంకా ప్రాథమిక దర్యాప్తు, నివేదికలు పూర్తికాకముందే సీబీఐ విచారణ కోరడం సబబు కాదని, కనీస సమాచారం రాకుండానే ఇలాంటి పిటిషన్ వేయడం తొందరపాటు చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో విజయ్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది.

ఈ తీర్పుతో విజయ్, టీవీకే వర్గాలు నిరాశ చెందాయి. అయినప్పటికీ ఆయన వెనుకడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన ముందున్న ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటికే విజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు మొదలుపెట్టారు. ప్రజల్లోనే ఉండి, నేరుగా వారితో మమేకం కావాలని నిర్ణయించుకున్నారు. కరూర్ ఘటనతో తన ఇమేజ్ దెబ్బతిన్నా, ఈ ఘటనను రాజకీయంగా తనకే అనుకూలంగా మలుచుకోవాలని విజయ్ వ్యూహాలు వేసుకుంటున్నారు. ఏదేమైనా, మద్రాస్ హైకోర్టు తాజా తీర్పు విజయ్ రాజకీయ ప్రయాణానికి మొదటి పెద్ద షాక్‌గా నిలిచింది. ఈ దెబ్బ నుంచి ఆయన ఎలాంటి వ్యూహాలతో బయటపడతారనేది ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: