
ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ ఘన విజయాలు సాధించింది. కానీ విభజన తర్వాత ఆ బలం చెల్లాచెదురైంది. చాలా మంది నేతలు ఇతర పార్టీల్లో చేరినా, గట్టి కేడర్ మాత్రం ఇప్పటికీ పార్టీని వదల్లేదు. హైదరాబాద్ నగరం, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఇప్పటికీ టీడీపీ శ్రేణులు గట్టి పట్టుతోనే ఉన్నాయి. ఇంతవరకు నేతలు పెద్దగా కనిపించకపోయినా, కార్యకర్తలు మాత్రం పార్టీ పతాకాన్ని ఎగురవేస్తూనే ఉన్నారు. ఇటీవల ఏపీలో నాలుగోసారి అధికారం సాధించిన టీడీపీకి తెలంగాణలో కూడా సానుకూల పరిస్థితులు సృష్టించవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని, తమ బలం నిరూపించుకోవాలని కేడర్ పట్టుబడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో తాము గెలుపు సాధించే సత్తా ఉందని కార్యకర్తలు చెబుతున్నారు.
“పార్టీ ప్రోత్సాహిస్తే కనీసం కొన్ని స్థానాలను కైవసం చేసుకుని టీడీపీ పునర్జన్మ పొందుతుందని” వారి వాదన. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో పోటీకి కూడా ఒత్తిడి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కార్యకర్తల ఒత్తిడి మరింతగా పెరిగింది. అదే సమయంలో కొందరు సీనియర్ నేతలు కూడా క్షేత్రస్థాయిలో పోటీ చేస్తే వాస్తవ బలం తేటతెల్లం అవుతుందని సూచిస్తున్నారు. “ముందుగా ఈ ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకోండి, తర్వాత విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసుకుందాం” అనే ఆలోచన కూడా వినిపిస్తోంది. అయితే చివరి నిర్ణయం మాత్రం అధినేత చంద్రబాబు తీసుకోవాల్సిందే. తెలంగాణలో తిరిగి పసుపుదళం కాలు మోపుతుందా? లేక మరింత ఆలస్యం చేస్తుందా? అన్నదానిపై ఇప్పుడు రాష్ట్ర టీడీపీ శ్రేణులు కళ్లప్పగించి చూస్తున్నాయి.