ఇప్పుడు ఎక్కడ చూసినా బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. రాజకీయంగా కీలక దశలో ఉన్న ఈ రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. అధికార జనతా దళ్ (యునైటెడ్) పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు వరుసగా పార్టీని వీడుతూ ఉండటం పెద్ద సంచలనంగా మారింది.ఇంతవరకు పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని బహిరంగంగా చెప్పిన నేతలే ఇప్పుడు నిశ్శబ్దంగా విపక్ష పార్టీలో చేరిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జేడీ)లో ఒకరి తర్వాత ఒకరు టాప్‌ లీడర్లు చేరిపోతూ ఉండడం సీఎం నితీష్‌కుమార్‌కి నిజంగా పెద్ద తలనొప్పిగా మారింది. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఇంత పెద్దఎత్తున నాయకుల మార్పులు జరగడం ఆయనకు మరో షాక్‌లా మారింది.


ఇదే పరిణామంలో, జెడీయూ మాజీ ఎంపీ సంతోష్ కుష్వాహా ఆర్‌జేడీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. మరోవైపు ప్రస్తుత బంక్ నియోజకవర్గ ఎంపీ గిరిధర్ యాదవ్ కుమారుడు చాణిక్య ప్రకాష్ రంజాన్, అలాగే జహానాబాద్ మాజీ ఎంపీ జగదీశ్ శర్మ కుమారుడు రాహుల్ శర్మ ఇద్దరూ కూడా పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సెన్సేషన్‌గా మారింది. ఈ ముగ్గురు నాయకులు త్వరలో తేజస్వీ యాదవ్ సమక్షంలో అధికారికంగా ఆర్‌జేడీ కండువా కప్పుకోబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఒకవైపు బీహార్ సిఎంగా మరోసారి అధికారం చేపట్టాలన్న కలలతో ఉన్న నితీష్‌కుమార్కు సీనియర్ నేతల వరుస రాజీనామాలు పెద్ద దెబ్బగా మారాయి. ఆయన కలలో కూడా ఊహించని రీతిలో నమ్మిన నాయకులే పార్టీని వీడిపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.



పూర్నియా ప్రాంతంలో సంతోష్ కుష్వాహా జెడీయూలో ప్రముఖ నేతగా ఎదిగారు. ఆయన ఆర్‌జేడీలో చేరడంతో, ఆ ప్రాంతంలో జెడీయూకు చెందిన ఓటు బ్యాంక్ గణనీయంగా చీలిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే రాహుల్ శర్మ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న నేత. చాణిక్య ప్రకాష్‌ కూడా జెడీయూ ఎంపీ గిరిధర్ యాదవ్ కుమారుడు కావడంతో, ఆయన ఆర్‌జేడీలో చేరడం ద్వారా బంక్ నియోజకవర్గంలో ఆర్‌జేడీ మరింత బలం పొందుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇక సీఎం నితీష్‌కుమార్‌కి ఇది నిజంగా పెద్ద షాక్. ఎంతో విశ్వాసం ఉంచిన నేతలే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా తిరగడంతో, పార్టీలో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి .  “ఇలాంటి మార్పులు ఎన్నికల ముందు జరగడం కొత్త విషయం కాదు. కానీ నితీష్‌కుమార్‌కి ఇది పెద్ద నష్టం అవుతుంది. ఎందుకంటే ఆయనను నమ్మించి, చివరికి నిండా ముంచేశారు ఆయన సన్నిహితులే” అని రాజకీయ ప్రముఖులు అంటున్నారు. ఇలా బీహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉధృతమైన ఈ పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వేదికను కుదిపేస్తున్నాయి. ప్రతి రోజు కొత్త కొత్త నాయకులు పార్టీ మారుస్తుండటంతో ఎన్నికల సమరానికి ముందు బీహార్‌లో రాజకీయ సునామీ తలెత్తినట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: