
ఇలాంటి కామెంట్లు బాహ్యప్రజల ముందు వస్తుండటంతో, నిర్దోషులైన మెజారిటీ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మా మీద తప్పు లేదు, అయినా అందరినీ కలిపి విమర్శిస్తున్నారు. తప్పు చేసిన వారి పేర్లు చెప్పి చర్యలు తీసుకోవాలి - కానీ అందరినీ కలిపి చెడగొట్టడం పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది” అని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. పార్టీ పట్ల విశ్వాసం ఉన్న, నిజాయితీగా పని చేస్తున్న నాయకులు కూడా ఇలాంటి కామెంట్ల వల్ల మానసికంగా దెబ్బతింటున్నారు. “మేము సూటిగా పనిచేస్తున్నాం, ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం, ప్రజలతో ఉన్నాం. అయినా మమ్మల్ని కూడా దోచుకుంటున్నారంటారా?” అని అడుగుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే ప్రజల్లో ప్రతికూలత పెరిగి, చివరికి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల ఇమేజ్‌కే నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అందుకే పార్టీ అంతర్గతంగా ఇప్పుడు ఓ డిమాండ్ జోరుగా వినిపిస్తోంది - “తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి, కానీ అందరినీ ఒకే లైన్లో నిలపొద్దు”. ఇది టీడీపీ భవిష్యత్తుకు కూడా అవసరం. తప్పు చేసిన కొందరిని వదిలి, నిజాయితీగా పని చేస్తున్న వారిని నిందించడం పార్టీ లోపల విభేదాలు పెంచుతుంది. టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది - ప్రజల అంచనాలు కూడా ఎత్తులోనే ఉన్నాయి. అలాంటప్పుడు పార్టీలో తలెత్తిన చిన్న తప్పులు పెద్దవిగా మారకముందే చంద్రబాబు జోక్యం అవసరం. తప్పు చేసినవారిని బయటపెట్టాలి కానీ, అందరినీ ఒకే రంగుతో రంగేయడం పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది! అంటూ ప్రశ్నిస్తున్నారు.