- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండటంతో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో 4 లక్షల 8 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక, వడపోతల అనంతరం మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇది జూబ్లీహిల్స్ రాజకీయ చరిత్రలో రికార్డు గా నిలిచింది. ఈ 58 మందిలో చిన్నచిన్న పార్టీల అభ్యర్థులతో పాటు, భారీ సంఖ్యలో ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ తరఫున లంకలపల్లి దీపక్ రెడ్డి ప్రధాన పోటీలో నిలిచారు.


ఈ ముగ్గురు అభ్యర్థులు ప్రాంతంలో హోరాహోరీ ప్రచారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ పార్టీ విజయమే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటం ఇప్పుడు ఎన్నికల ప్రక్రియకే కొత్త సవాల్‌గా మారింది. ఈవీఎంల సామర్థ్యం పరిమితంగా ఉండటంతో, 58 మంది పేర్లు ఒకే ఈవీఎంలో పొందుపరచడం సాధ్యం కాకపోవడంతో ఎన్నికల సంఘం ఒక్కో పోలింగ్ బూత్‌లో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి పేరు, ఫోటో కోసం ఈ నాలుగు యంత్రాలలో వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇది ఓటింగ్ ప్రక్రియలో కొంత గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చదువుకున్న ఓటర్ల శాతం కేవలం 40% మాత్రమే ఉంది. నిర‌క్ష్య‌రాస్యులైన వారు తమ అభ్యర్థులను గుర్తించడం కొంత క్లిష్టంగా మారవచ్చు. దీని వల్ల పోలింగ్ బూత్‌ల వద్ద ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నికల సంఘం అభ్యర్థులకు సీరియల్ నంబర్లు కేటాయించేందుకు సిద్ధమవుతోంది. ఆ నంబర్ల ఆధారంగా అభ్యర్థులు ప్రచారంలో ఓటర్లకు తమ స్థానం, సింబల్ వివరాలు సులభంగా తెలుస్తాయి. మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఈసారి కేవలం రాజకీయ పోటీ కాకుండా, సాంకేతిక, నిర్వహణపరమైన సవాళ్లతో కూడిన పరీక్షగా మారింది. ఎవరి వ్యూహం పనిచేస్తుందో, ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారో నవంబర్ 11నే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: