ఇక తన ఓటమికి పార్టీ లోపలి నుంచే ప్రయత్నాలు జరిగాయని, పార్టీలోనే తనకు ఇబ్బందులు సృష్టించారని కవిత స్పష్టంగా పేర్కొనడం గులాబీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె మాటల్లో గులాబీ పార్టీ నేతలపై ఉన్న తీవ్ర అసంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పేర్లు ప్రస్తావించకపోయినా, ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా ఉన్న విభేదాలను, అసంతృప్తిని తేటతెల్లం చేస్తున్నాయి. సంచలన వ్యాఖ్యలు: "అవసరమైతే పార్టీ పెడతాం.. కాంగ్రెస్ మునిగిపోయే నావ! .. రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి కవిత చేసిన తాజా వ్యాఖ్యలు ఈ మొత్తం చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. ఆమె మాట్లాడుతూ, "నాతో పార్టీ పెట్టించడానికి కేసీఆర్ గారు బయటకు పంపించారని అంటున్నారు. కానీ అది నిజం కాదు. కేసీఆర్ గారికి అలాంటి అవసరం లేదు. నాకు ఆధారాలు ఉన్నప్పుడే మాట్లాడుతాను. అవసరమైతే రాజకీయ పార్టీని కచ్చితంగా పెడతాను.
కాంగ్రెస్ ఇప్పుడు మునిగిపోతున్న నావ లాంటిది, ఆ పార్టీ మద్దతు అవసరం లేదు” అని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె 'జాగృతి' పేరుతో పార్టీని ప్రారంభిస్తారా లేక పూర్తిగా కొత్త పేరుతో ముందుకు వస్తారా అనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మొత్తానికి, కల్వకుంట్ల కవిత దూకుడు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మళ్లీ వేడెక్కిస్తోంది. ఆమె కొత్త పార్టీ ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే, కవిత రాజకీయ ప్రస్థానం రాష్ట్రంలోని ప్రతి ప్రధాన పార్టీకీ కచ్చితంగా ఒక ఆలోచనలో పడేసే అంశమే. ఏపీలో వైఎస్ షర్మిల మాదిరిగా కవిత ప్రభావం వీగిపోతుందా, లేక తెలంగాణలో కొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతుందా అన్నది తేలాలంటే కవిత తీసుకునే తదుపరి నిర్ణయం, ఆమె పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి