ఇంటర్ ఫలితాల్లో అవకతవకల ఉదంతం మ‌లుపులు తిరుగుతోంది. ఈ ప‌రిణామంపై తెలంగాణ‌ హైకోర్టులో పిటిషన్ దాఖ‌లైంది. దీనిపై హైకోర్టులో విచారణ సంద‌ర్భంగా కీల‌క వాదోప‌వాదాలు జ‌రిగాయి. ప్ర‌భుత్వం వెల్ల‌డించిన స‌మాచారంతో కోర్టు సంతృప్తి ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆడిషనల్ ఏజీ రామచందర్ రావు కోర్టుకు వివ‌రణ ఇచ్చారు. ఇంటర్ ఫలితాలలో వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ వేశామని తెలిపారు. 9 లక్షల మంది 70 వేల మంది విద్యార్థులు రాశారని, తెలిపారు. తప్పుల్ని సరిచేస్తామ‌ని, వారంలోపు సమస్య పరిష్కారం చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 


ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఇప్ప‌టివ‌ర‌కు 16 మంది విద్యార్థులు చనిపోయారని పిటిషనర్ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇంద‌రు విద్యార్థులు మ‌ర‌ణించినా...ఇప్పటి వరకు ఇంటర్ బోర్డ్ స్పందించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వెల్ల‌డించారు. 50 వేల మంది విద్యార్థులు,వారి తల్లిదండ్రులు  రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని  పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయడం పరిష్కారం కాదని, విద్యార్థులకు జరగాల్సిన న్యాయం కోసం బోర్డులో ఉన్న లోపల్ని ఎత్తి చూపాల‌ని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులకు సమస్యలకి పరిష్కారాలు చూస్తామ‌ని వెల్ల‌డించింది.


అనంత‌రం అధ‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్  వివ‌ర‌ణ ఇస్తూ, ఈ ఏడాది 9.7 లక్షల విద్యార్థులు పరీక్షలు రాశారని, ఈ ఏడాది 9వేల అప్లికేషన్లు రీవాల్యుయేష‌న్‌కు వ‌చ్చాయ‌ని, ప్రతి ఏటా 25వేలు వస్తాయన్నారు. ప్రతి ఏడు 30 శాతానికి పైగా విద్యార్థులు ఫైయిల్ అవుతున్నారన్నారు. 9 లక్షల 70 వేల మందికి 2నెలల సమయం పడితే 3 లక్షల మంది స‌మాధాన ప‌త్రాలు మూల్యాంక‌నం చేసేందుకు రెండు నెలల సమయం పడుతుందని తెలిపారు. కాగా, ఈ సంద‌ర్భంగా కోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ``మాకు కావాల్సింది గ‌ణాంకాలు కాదు ప‌రిష్కారం`` అని హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సోమవారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన 3 లక్షల విద్యార్థుల రీ వాల్యుయేషన్ పై ఇంటర్ బోర్డ్ నిర్ణయం తెలపాలని హైకోర్టు ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: