ఏ ప్ర‌భుత్వాలైనా ప్ర‌జా ప్ర‌యోజ‌నాలకు అనుగుణంగా ప‌రిపాల‌నా సాగించాలి. కానీ ప్ర‌స్తుత రాజీకీయాలు భిన్నంగా ఉన్నాయి. భిన్న వ‌ర్గాల ప్ర‌యోజ‌నాలు, ఒత్తిళ్ల మ‌ధ్య ప‌నిచేయవ‌ల‌సి వ‌స్తోంది. అయితే అధికార ప్ర‌భుత్వాల‌కు పార్ల‌మెంట్ లో మెజారీటి ఉన్నంత మాత్రాన ఒంటెద్దు పోక‌డ‌ల‌కు పోవ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాదు. అన్ని ప‌క్షాల‌ను సంప్ర‌దించి ముందుకు పోవ‌డ‌మే అధికార ప్ర‌భుత్వ ల‌క్ష‌ణం.  ఈ విష‌యంలో ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ ఒకందుకు ఉద‌హ‌రణ గా చెప్పుకోవ‌చ్చు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా భూసేక‌ర‌ణ వివాధానికి తెర తీశారు ప్ర‌దాని మోడీ. ఆదివారం మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో త‌న మ‌నోగ‌తాన్ని విపిచెప్పారు. భూ ఆర్డినెన్స్ తిరిగి జారీ చేయ‌ద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌తి ప‌క్షాల‌తో స‌హా వివిధ వ‌ర్గాల నుంచి ఆర్డినెన్స్ కు తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదురైన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌దని తెలిపారు. రైతుల‌కు మేలు చేసే ఏ సూచ‌న‌నైనా రాజ్య‌స‌భ‌లో పెండింగ్ లో ఉన్న బిల్లు లో పొందుప‌ర‌చ‌డానికి ప్ర‌భుత్వం సిద్దంగా ఉన్నట్టు ప్ర‌ధాని వెల్ల‌డించారు.
ఆర్డినెన్స్ జారీ చేయ‌డానికి బ‌దులు


ఆర్డినెన్స్ జారీ చేయ‌డానికి బ‌దులు 2013నాటి పాత చ‌ట్టాన్నే అమ‌లు చేస్తామ‌ని తేల్చిచెప్పారు. రైతుల‌కు న‌ష్టం క‌లిగించే ఏ విధానాన్నీ బీజేపీ అనుస‌రించ‌బోద‌ని చెప్పుకొచ్చారు. కొంత కాలంగా భూసేక‌ర‌ణ చ‌ట్టం పై పార్ల‌మెంట్ లోప‌లా, బ‌య‌టా జ‌రుగుతున్న ఆందోళ‌న నేపథ్యంలో ప్ర‌ధాని ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. 30 సంవ‌త్స‌రాల సుదీర్ఘ కాంల తరువాత పార్ల‌మెంట్ లో మెజారీటి సాధించి అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ, ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్థ‌లో త‌న‌కున్న పరిమితుల‌ను గుర్తించి అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని నిర్ణ‌యించారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు 2013 నాటి చ‌ట్టం లో స‌వ‌ర‌ణల‌ను రాష్ట్రాలు సూచించిన‌ప్ప‌టికీ భూమి బిల్లుపై అనేక సందేహాలు లేవ‌దీశార‌ని, రైతుల‌లో భ‌యాందోళ‌న‌లు రేకెత్తించార‌ని ఆరోపించారు.కాల‌వలు, గ్రామాల విద్యుదీక‌ర‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ర‌హ‌దారుల నిర్మాణానికి భూ సేక‌ర‌ణ‌చ‌ట్టానికి స‌వ‌ర‌ణ అవ‌స‌ర‌మ‌ని మోడీ స్ప‌ష్టం చేశారు. జై జ‌వాన్ జై కిషాన్ అనేది నినాదం కాదు అది మంత్రం అని ఆయ‌న పేర్కొన్నారు.


చాలా వ‌ర‌కు ప్ర‌తిప‌క్షాలు కొన్నిఅధికార ఎన్డీఎ మిత్ర ప‌క్షాలు గ‌ట్టిగా వ్య‌తిరేకించడంతో భూమి బిల్లు పార్ల‌మెంట్ లో ఆమోదం పొంద‌లేక‌పోయినందున ప్ర‌భుత్వం ఇంత వ‌ర‌కు 3 సార్లు ఆర్డినెన్స్ జారీ చేసింది. 2013 నాటి చ‌ట్టం స‌వ‌ర‌ణ‌కు ఉద్దేశించిన బిల్లు ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ సంయుక్త క‌మిటీ(జెపిసి) ప‌రిశీల‌న‌లో ఉంది. అనేక పార్టీలు తీవ్రం అభ్యంత‌రాలు లేవ‌దీసిన నేప‌థ్యంలో రాజ్య‌స‌భ బిల్లు ను జెపిసి నివేందించింది. ఈ బిల్లును చ‌ట్ట‌రూపంలోకి తీసుకురావ‌డానికి ప్ర‌భుత్వం కార్య‌నిర్వ‌హ‌క వ్య‌వ‌స్థ మార్గం బ‌దులు శాస‌న వ్య‌వ‌స్థ మార్గాన్ని అనుస‌రిస్తుంద‌ని ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న స్ప‌ష్టం చేస్తోంది. భూసేక‌ర‌ణ ఆంశం రాజ్యాంగం ఉమ్మ‌డి జాబితాలోనిది క‌నుక దీనిపై చ‌ట్టం చేసే బాధ్యత‌ను రాష్ట్రాల‌కు వ‌ద‌లి వేయాల‌ని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నేప‌థ్యంలో ఆర్డినెన్స్ ను తిరిగి జారీ చేయ‌రాద‌నే నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఉన్న‌త స్థాయి వ‌ర్గాలు వివరించాయి. 

భూసేక‌ర‌ణ ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు


వ్య‌వ‌సాయాదారిత భార‌తీయ స‌మాజంలో భూసేక‌ర‌ణ ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. పారిశ్రామికాభివృద్ధికి, పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ కు ప్ర‌తిబంధ‌కాలు లేని విధంగా భూసేక‌ర‌ణ చ‌ట్టాన్ని రూపొందించాల‌ని స‌ర‌ళీక‌ర‌ణ విధానాలు అమ‌లులోకి వ‌చ్చిన త‌రువాత పాల‌కులు భావించారు. పశ్చిమ బెంగాల్ లో నందిగ్రామ్, సింగూరు భూసేక‌ర‌ణ వ్య‌తిరేకొద్య‌మాల త‌రువాత ఇందుకు పెద్ద క‌స‌ర‌త్తే జ‌రిగింది. దేశ వ్యాప్తంగా లోతైన అధ్య‌యనం తరువాత యూపీఏ స‌ర్కార్ భూ సేక‌ర‌ణ చ‌ట్టం-2103 ను రూపొందించింది. అయిఏత బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఈ చ‌ట్టం తో అనుకున్న స్థాయిలో పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డం సాధ్యం కాద‌ని, అభివృద్ధి పేరుతో చ‌ట్టానికి అనేక స‌వ‌ర‌ణ‌ల‌ను ప్ర‌తిపాదించింది. 


ముఖ్యంగా భూ సేర‌క‌ణ చేసేట‌ప్పుడు సంబంధిత రైతుల ఆమోదం త‌ప్ప‌ని స‌రి కాద‌ని, భూ సేక‌ర‌ణ‌కు ముందు సామాజిక ప్ర‌భావ అధ్య‌య‌నం చేట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్రం చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు త‌ల‌పెట్టింది. దీంతో బీజేపీ ప్ర‌తిపాదిత భూ సేక‌ర‌ణ చ‌ట్టం దేశంలో మునుపెన్న‌డూ లేని విధంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భూ సేక‌ర‌ణ చ‌ట్టంలో మోడీ కోరుతున్న స‌వ‌ర‌ణ‌ల‌ను రైతులు , ప్ర‌జాస్వామ్య‌వాదులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. కానీ పారిశ్రామికవ‌ర్గాలు మాత్రం మోడీ విధానానికి మ‌ద్ద‌తు ఇస్తున్నాయి.  పారిశ్రామికవ‌ర్గాలు త‌మ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా భూ సేక‌ర‌ణ విధానం ఉండాల‌ని కోరుకోవ‌డం స‌హ‌జం. అసోచామ్ తాజా ప‌రిణామాల‌పై తీవ్రంగానే స్పందించింది. ఇది సంస్క‌ర‌ణ‌ల‌కు తీవ్ర విఘాతమ‌ని, పారిశ్రామికీక‌ర‌ణకు కీల‌క‌మైన భూసేక‌ర‌ణ ఇక పై క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. 
ఈ క్ర‌మంలో భూ ఆర్డినెన్స్ సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న మోడీ ప్ర‌తిప‌క్షాల ఒత్తిడికి త‌లొగ్గిన‌ట్టుగానే ఉంది. రైతు ప్ర‌యోజ‌నాల‌ను దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం ఒకింత స‌బ‌బె అయినా ప్ర‌తిప‌క్షాల వాద‌న‌ల‌కు దీటుగా నిలువలేక‌పోయాడ‌ని వాద‌న ఉంది. అంతేకాక భూ సేక‌ర‌ణ వివాదాస్ప‌ద ఆంశాల‌లో అంద‌రిని క‌లుపుకుపోవ‌డం మరింత మంచిద‌న్న అభిప్రాయానికి వ‌చ్చారు ప్ర‌ధాని మోడీ. ఎదిఎమైనా గ‌త కొన్ని నెల‌లుగా భూ సేక‌ర‌ణ వివాధానికి ప్ర‌ధాని నిర్ణ‌యంతో  ముగింపు దొరికింది.


మరింత సమాచారం తెలుసుకోండి: