అవును ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపిఎస్పీ బెటాలియన్స్ అడిషినల్ డిజిపి స్ధానం నుండి బదలి అయిన  మాదిరెడ్డి ప్రతాప్ వ్యవహారం చూసిన తర్వాత చాలామందికి పిచ్చెక్కిపోతోంది. మాదిరెడ్డి వ్యవహారం తర్వాత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులెవరు, ఎటువంటి వాళ్ళని చేరదీస్తాడు ? ఎవరిని అందలాలు ఎక్కిస్తాడు ? అనే విషయాలు ఎవరికీ బోధపడటం లేదు.  కుర్చీలో కూర్చున్న తర్వాత ఇక మనం హ్యాపీనే మనకేం కాదు అని అనుకునేంత లోపలే విసిరి బయటకు తన్నేస్తున్నాడు. ఎల్వీ సుబ్రమణ్యం వ్యవహారం దగ్గర నుండి మాదిరెడ్డి వ్యవహారం వరకూ ఇదే కథ పునరావృతమవుతోంది.

 

ఇక్కడ అందరికీ వస్తున్న అనుమానాలు ఏమిటంటే జగన్ను ఎవరూ సరిగా రీడ్ చేయలేకపోతున్నారా ? అని. ప్రధాన కార్యదర్శి పోస్టు నుండి ఎల్వీ అర్ధాంతరంగా బయటకు వెళ్ళిపోవాల్సొస్తుందని ఎవరైనా అనుకున్నారా ? అలాగే ఢిల్లీలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమంత్రి కార్యాలయంలో  ఈ స్ధాయిలో చక్రం తిప్పుతాడని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పిలిచి నెత్తిన పెట్టుకోరు. అలాంటిది అందరు ఆశ్చర్యపోయేట్లుగా అదేపనిగా ప్రవీణ్ ను జగన్ సిఎంవోలో పెట్టుకున్నాడు. ఇక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి  పివి రమేష్ వ్యవహారం కూడా అంతే. సర్వీసులో ఉండగా ఆయనేమీ అద్భుతంగా పనిచేసిన అధికారి అని ఎప్పుడూ అనిపించుకోలేదు. కానీ రిటైర్ అయిన తర్వాత ఆయన్ను కూడా సిఎంవోలో పెట్టుకున్నాడు.

 

అలాగే చంద్రబాబునాయుడు హయాంలో చక్రంతిప్పిన సతీష్ చంద్రను ముందు కొంతకాలం వెయిటింగ్ లో పెట్టినా తర్వాత పోస్టింగు ఇచ్చేశాడు.  సరే ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు మీదున్న ఆరోపణల కారణంగా ఆయన్ను జగన్ ఉపేక్షించడన్న విషయాన్ని అందరూ ఊహించిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓవర్ యాక్షన్ చేసేంత వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయాన్ని జగన్ అసలు పట్టించుకోలేదనే చెప్పాలి. చంద్రబాబు హయాంలో సిఎంవోలో కీలకంగా పనిచేసినా మరో ఐఏఎస్ అధికారి గిరిజాశంకర్ కు వైసిపి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ పోస్టులో నియమించాడు.

 

అంటే జగన్ ప్రభుత్వంలో పోస్టుంగు రావాలంటే రెడ్డి అయ్యుండాలని, కమ్మ వాళ్ళకు ప్రాధాన్యత దక్కదని జరుగుతున్న ప్రచారమంతా తప్పనే చెప్పాలి. అధికారి సామాజికవర్గంతో పనిలేకపోయినా జగన్ నమ్మకాన్ని సంపాదించుకుంటే చాలు పోస్టింగు దక్కుతుందనేది ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. దివంగత సిఎం, తండ్రి వైఎస్సార్ తో ఎంత సన్నిహితమున్నా అవేవీ జగన్ దగ్గర పనిచేయదన్న విషయం ఇప్పటికే చాలామందికి అర్ధమైపోయింది. వైఎస్సార్ తో  సన్నిహితంగా మెలిగిన వాళ్ళల్లో చాలామంది జగన్ దగ్గర కనబడటం లేదంటేనే విషయం అర్ధమైపోతోంది. తమ వ్యవహార శైలి ఎలాగుంటే జగన్ దృష్టిలో పడతామో, మంచి మార్కులు కొట్టేయొచ్చో అర్ధంకాక అధికార యంత్రాంగం మొత్తం జుట్లు పీక్కుంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: