ముంబయిలోని క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్ దొరికిన కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఇదో చిన్న కేసుగా మిగిలేదే .. కానీ.. ఈ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్‌ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో సంచలనంగా మారింది. దీనికి తోడు దర్యాప్తు సంస్థలు ఈ కేసు వివరాలు ఎప్పటి కప్పుడు వెల్లడిస్తూ మీడియాలో బాగా కవరేజ్‌ వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇన్నాళ్లూ ఈ సంఘటనపై మౌనం వహించిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే ఇప్పుడు పెదవి విప్పారు. మోడీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేయడాన్ని సీఎం ఉద్దవ్‌ ఠాక్రే పరోక్షంగా విమర్శించారు. ఆయన ఏమంటున్నారంటే.. కేంద్రం దర్యాప్తు సంస్థలు చిటికెడు డ్రగ్స్ పట్టుకుని నానా హడావిడి చేస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో మహారాష్ట్ర పోలీసులు 160 కిలోల డ్రగ్స్ ను పట్టుకున్నాయని ఉద్దవ్ ఠాక్రే చెబుతున్నారు. కానీ తామెప్పుడూ హడావిడి చేయలేదని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.


కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రం  సెలెబ్రటీలను అరెస్టు చేసి.. వారితో ఫోటోలు దిగడంపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని ఉద్దవ్‌ ఠాక్రే విమర్శించారు. అంతే కాదు.. ఆయన ఇంకో కీలకమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. డ్రగ్స్ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఓవర్ యాక్షన్‌పై ఆయన విమర్శించారు. ఏం.. ఒక్క మహారాష్ట్రలోనే డ్రగ్స్ దొరికాయా? అని ఆయన నిలదీస్తున్నారు. ప్రత్యేకించి గుజరాత్‌ లో దొరికిపోయిన వందల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ అంశాన్ని ఆయన నిలదీశారు.


గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో దొరికిన డ్రగ్స్ సంగతేమిటి అని ఉద్దవ్ ఠాక్రే నిలదీశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేంద్రం అనేక మార్లు ప్రయత్నాలు చేశారని ఆయన మండిపడుతున్నారు. అలాంటి ప్రయత్నాలు సఫలం కాబోవని.. ఇకనైనా అవి మానుకోవాలని ఉద్దవ్ సూచించారు. ఇక్కడ ఉద్దవ్‌ ప్రశ్నల్లోనూ లాజిక్ ఉంది.. మరి దీనిపై మోదీ ఏమైనా స్పందిస్తారా.. అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: