సాధారణంగా మనుషులకి ఏ కష్టం వచ్చినా భగవంతుని దగ్గర మొర పెట్టుకుంటాం. ఆ సమస్య తీరిస్తే పలానాది చేస్తామని మొక్కు మొక్కుకుంటాం. ఉదాహరణకు తల నీలాలు సమర్పించటం, బట్టలు పెట్టటం, నిలువెత్తు బంగారాన్ని పంచుతామని మొక్కటం ఇలా ఎన్నో రకాల మొక్కులు మొక్కుతుంటారు. వీటిలో అతి పురాతనమైనది విశిష్టమైనది తల నీలాలు సమర్పించటం. అస‌లు దేవునికి తలనీలాలే ఎందుకివ్వాలి? ఫ‌లితం ఏంటీ? అనే సందేహం చాలామందికి వ‌స్తుంటుంది. 

 

నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ధర్మశాస్త్రాల ప్రకారం... మనం చేసే సర్వ కర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దాని వల్ల అవి పాపాలకు నిలయంగా మారతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలంటే, వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుని సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులమవుతాం. ఈ ఉద్దేశంతోనే తలనీలాలు సమర్పించే ఆచారం మొదలయ్యింది. 

 

అయితే ప్ర‌త్యేకించి త‌ల నీలాలే ఎందుకు ఇస్తారు..? అంటే మ‌రో కార‌ణం ఉంది. కేశాలు అందానికి సూచిక. అది వ్యామోహాన్ని కలుగచేసే అంశం. ఆకర్షణ వ్యామోహానికి దారితీయడమే కాకుండా, అనుబంధాలను, అందమైన జీవితాన్ని చిందరవందర చేస్తుంది. జుట్టు లేకపోవడం వలన మనసులో ఎలాంటి వికారాలు కలగవు. కనుక నీతిబద్ధమైన, నియమబద్ధమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఏర్పడుతుంది.ఇక తల నీలాలు సమర్పించడమంటే, అహంకారాన్ని వదులుకున్నట్టుగా స్వామివారికి చెప్పడమే.

మరింత సమాచారం తెలుసుకోండి: