రేపే వినాయక చవితి. జనాలు భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా చోట్ల వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. డీజేలతో, పాటలతో మారుమ్రోగేలా సందడి వాతావరణం నెలకొంది. బంధువులు, చుట్టాలు ఒకచోట చేరి వినాయకుడిని కుటుంబ సభ్యులందరూ కలిసి పూజించేందుకు రకరకాల పిండిపదార్థాలు, నైవేద్యాలు తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో “వినాయక చవితిని ఎందుకు జరుపుకోవాలి?”, “ఈ రోజున ఎలాంటి పనులు చేయాలి?”, “ఏవి చేయకూడదు?” అనే ప్రశ్నలపై చాలామంది సోషల్ మీడియాలో చర్చలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా, “వినాయక చవితి రోజున చంద్రుణ్ని ఎందుకు చూడకూడదు?” అన్న ప్రశ్న ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.


మనందరికీ తెలిసిందే, వినాయక చవితి పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి రోజున ఘనంగా జరుపుకుంటారు. కులమత భేదాలు లేకుండా చిన్నా పెద్దా అందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు. ఎవరి శక్తి, స్థాయి అనుసరించి పూజలు చేస్తారు. కానీ, ప్రతి ఒక్కరూ పాటించే ముఖ్యమైన విషయం ఏమిటంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ని చూడకూడదు. పొరపాటున చూసినా కష్టాలు వస్తాయని పెద్దలు చెబుతారు. ఆ కష్టాలు మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు తప్పవని నమ్మకం ఉంది. ఒకప్పుడు ఈ విషయం పెద్దలకు బాగా తెలిసి ఉండేది. కానీ నేటి తరం పిల్లలకు ఇది అంతగా తెలియకపోవడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారు.
చంద్రుణ్ని ఎందుకు చూడకూడదు?



పురాణ కథనం ప్రకారం:

వినాయకుడు మంచి భోజన ప్రియుడు. తన పుట్టినరోజు రోజున (చవితి రోజు) బాగా కడుపునిండా కుడుములు, ఉండ్రాలు, రవ్వ లడ్డు తదితర పిండిపదార్థాలు తిన్నాడు. తర్వాత తన వాహనమైన మూషికంపై ప్రయాణిస్తుండగా, మూషికం అ సర్పాని చూసి ఒక్కసారిగా భయపడి తడబడింది. దీంతో గణేశుడు కిందపడిపోయాడు. కడుపు నిండుగా ఉండడంతో లేవడానికి కష్టపడ్డాడు. ఆ దృశ్యం చూసి చంద్రుడు గట్టిగా నవ్వాడు. దాంతో కోపగించిన గణేశుడు చంద్రుణ్ణి శపించాడు:
“నా పుట్టినరోజున నిన్ను చూసినవారు అపవాదాలకు లోనవుతారు” అని శపించాడు. అప్పటినుంచి ఈ శాపం తరతరాలుగా వస్తూనే ఉంది. అందుకే వినాయక చవితి రోజున చంద్రుణ్ని చూడకూడదనే నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది.



దోషం పోవాలంటే ఏం చేయాలి..?

వినాయకుడు శపించినా, భక్తులు కష్టాల్లో పడకూడదని మరో మార్గం చూపించాడు. పూజ పూర్తయ్యాక గణేశుని కథ విని, అక్షింతలను కొన్నింటిని ఆయన పాదాల దగ్గర, మరికొన్నింటిని తమ తలపై వేసుకుంటే ఆ దోషం పోతుందని పండితులు చెబుతున్నారు. ఇది పురాణాల్లోనూ ఉంది. శ్రీకృష్ణుడే ఒకసారి వినాయక చవితి రోజున చంద్రుణ్ని చూసి నిలాపనిందలు మోయాల్సి వచ్చింది.  వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినందుకు శ్రీ కృష్ణుడు, సప్తరుషుల భార్యలు నీలాప నిందలు మోయాల్సి వస్తుంది. ఆ సమస్యను పార్వతీదేవి సూచించిన విధంగానే గణేశుని కథ విని అక్షింతలు వేసుకోవడంతో పరిష్కారం దొరికిందని చెబుతారు. అందుకే ఈ ఆచారాన్ని తరతరాలుగా ప్రతి ఇంట్లో పాటిస్తూ వస్తున్నారు. స్టార్ సెలబ్రిటీస్ సహా చాలామంది కూడా ఈ నమ్మకాన్ని గౌరవంగా అనుసరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: