
సూరత్: కొంత మంది చనిపోయి కూడా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఎన్నో కుటుంబాలకు ఆశాకిరణంగా మారతారు. అలాంటి వారిలో ఒకడు.. జాష్ ఓజా. ఈ చిన్నారి వయసు.. కేవలం రెండున్నరేళ్లు. రెండున్నరేళ్ళ వయసులోనే తాను చనిపోతూ ఐదుగురి ప్రాణాలను కాపాడాడు. వాటి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాడు.
గుజరాత్‌లోని సూరత్ లో సంజీవ్ ఓజా అనే వ్యక్తి తన భార్య, కొడుకు జాష్తో జీవిస్తున్నారు. ప్రతిరోజూలానే డిసెంబర్ 9న కూడా చిన్నారి జాష్ బాల్కనీలో ఆడుకుంటున్నాడు. అతడి తల్లి ఏదో పనిలో నిమగ్నమై ఉంది. ఇంతలో బాల్కనీలో నుంచి ఏదో కింద పడినట్లు శబ్దం. ఏంటా అని వచ్చి చూసిన ఆమె పెద్ద కేక పెట్టింది. జాష్ ఆడుకుంటూ రెండో అంతస్థులోని బాల్కనీలోనుంచి కింద పడిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న కొడుకును తీసుకుని వెంటనే ఆస్పత్రికి పరిగెత్తింది.
రోజులు గడుస్తున్నాయి. కానీ డాక్టర్లు ఏమీ చెప్పడం లేదు. అయితే ట్రీట్ మెంట్ జరుగుతోంది కదా బిడ్డ కొలుకుంటాడులే అనుకున్నారు వారిద్దరూ. అయితే డిసెంబర్ 14న డాక్టర్లు వారికి ఓ చేదు వార్త వారికి చెప్పారు. జాష్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడించారు. అప్పటికి జాష్ కు ట్రీట్ మెంట్ మొదలుపెట్టి 5 రోజులు.
చిన్న దెబ్బే కదా మళ్లీ సరదాగా ఆడుకుంటూ తమముందు తిరుగుతాడన్న తమ ఒక్కగానొక్క కొడుకు ఇక ఎన్నటికీ తిరిగిరాడన్న వార్త ఆ దంపతులను కలచివేసింది. అయితే ఈ సమయంలోనూ ఓజా దంపతులు గుండె రాయి చేసుకుని ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ అవయవాలతో ఇతరుల ప్రాణాలు కాపాడాలని అనుకున్నారు.
తమ కొడుకు అవయవాలను ఇతరులకు డొనేట్ చేసేందుకు తల్లిదండ్రులిద్దరూ అంగీకరించడంతో ఓజా ఊపిరితిత్తులు, గుండె, కళ్లు, కిడ్నీలు, కాలేయాన్ని అవసరం ఉన్న పేషంట్లకు వైద్యులు వెంటనే పంపించారు. ఓజా గుండె, ఊపిరితిత్తులను 3 గంటల వ్యవధిలోనే విమానం ద్వారా చెన్నైకి తరలించారు.
రష్యాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి ఓజా గుండెను అమర్చారు.
ఓజా రెండు కిడ్నీలలో ఒక కిడ్నీ 13 ఏళ్ల బాలికకు అమార్చగా.. మరో కిడ్నీ సూరత్‌కు చెందిన 17 ఏళ్ల మరో బాలికకు అందించారు. ఉక్రెయిన్‌కు చెందిన నాలుగేళ్ల బిడ్డకు ఓజా ఊపిరితిత్తులను వినియోగించారు. నవ్వుతూ కళ్ళముందు తిరుగాడిన బిడ్డ చనిపోయాడన్న బాధలోనూ వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఇది చాలా గొప్ప నిర్ణయమని వైద్యులు ఓజా దంపతులను ప్రశంసించారు.