మీరెప్పుడైనా బిర్యానీ తిన్నారా..?. ‘ఇదేం ప్రశ్న.. బిర్యాని తినని వాడు కూడా ఉంటాడా..? అని అనుకుంటున్నారా..? అయితే నేను అడిగేది సాధారణ బిర్యానీ గురించి కాదు. ఓ స్పెషల్ బిర్యానీ గురించి. అవును.. మీరు తిన్న బిర్యానీ ఏ వందో, రెండొందలో, మహా అయితే ఓ వెయ్యి రూపాయలో ఉంటుంది. అంతేకదా. అయితే ఎప్పుడైనా ప్లేటు బిర్యానీకి అక్షరాలా రూ.20 వేలు చెల్లించారా..? కోప్పడకండి. నిజంగా ఓ స్పెషల్ బిర్యానీ ఖరీదు ఏకంగా రూ.20వేలు. కానీ ఇది మన దేశంలో కాదు లెండి. దుబాయ్‌లో. ఇంతకీ ఆ బిర్యానీ స్పెషాలిటీ ఏంటో తెలుసా..? అది గోల్డ్ బిర్యానీ.

దుబాయి ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌లో బాంబే బరో అనే భారతీయ రెస్టారెంట్‌‌ ఉంది. ఈ రెస్టారెంట్ అక్కడ బిర్యానికీ ఎంతో పాపులర్. సాధారణ బిర్యానికి కాదు.. గోల్డ్ బిర్యానీకి. ఇక్కడ గోల్డ్ బిర్యానీ కోసం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు ఈ రెస్టారెంట్‌కు వస్తుంటారు.  ఈ గోల్డ్ బిర్యానీని ‘రాయల్‌ గోల్డ్‌ బిర్యానీ’ పేరుతో ఇక్కడి నిర్వాహకులు పిలుస్తుంటారు. ఆ బిర్యానీ ప్లేట్‌ ధర 1000 దిర్హామ్‌లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.19,700. ఈ బిర్యానీని 23 కేరట్ల తినే బంగారంతో గార్నిష్‌ చేసి చేసి మీకు అందిస్తారు. అందుకే దీనికి గోల్డ్‌ బిర్యానీ అని పేరుపెట్టారు. ఇదొక్కటే కాదు.. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి.

సాధారణంగా బిర్యానీలో ఒకేరకంగా ఉండే రైస్ ఉంటుంది. కానీ ‘రాయల్‌ గోల్డ్‌..’లో అనేక రైస్ రకాలుంటాయి. బిర్యానీ రైస్‌, కీమా రైస్‌, కేసరి రైస్, వైట్ రైస్ వంటి రకరకాల రైస్‌లను వినియోగించి ఈ బిర్యానీని రెడీ చేస్తారు. దానిపై ఉడకబెట్టిన గుడ్లు, చిన్న బంగాళాదుంపలు, జీడిపప్పు, దానిమ్మ గింజలు వంటి వాటితో చూడగానే నోరూరేలా రెడీ చేస్తారు. రైస్‌పై కశ్మీరీ గొర్రె కబాబ్స్‌, ఓల్డ్‌ దిల్లీ కబాబ్స్‌, రాజ్‌ఫుత్‌ చికెన్‌ కబాబ్స్‌, మొఘలాయి కోఫ్తా వంటి మాంసం ముక్కలను పెట్టి వాటిపై 23 కేరట్ల తినే బంగారాన్ని అలంకరిస్తారు. బిర్యానీతో పాటు నిహారీ సలాన్‌, జోధ్‌పురి సలాన్‌, బాదామీ సాస్‌, రైతాను సర్వ్ చేస్తారు.

ఈ ప్లేట్‌ సర్వ్ చేసేందుకు 45 నిమిషాలు పడుతుంది. బంగారు రంగు ఆప్రాన్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు అతిపెద్ద బిర్యానీ ప్లేట్‌ను తీసుకొస్తారు. ఇది ఒక్కటి నలుగురి నుంచి ఆరుగురికి ఎంచక్కా సరిపోతుంది. అంతేకాదు ఇప్పటివరకు ప్రపంచంలో ఇంత ఖరీదైన బిర్యానీ ఎక్కడా లేదని రెస్టారెంట్‌ నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. కాబట్టి కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనే ఎంచక్కా వెళ్లి ఆరగించొచ్చు. చెబుతుంటేనే నోరూరిపోతుంది కదూ.

మరింత సమాచారం తెలుసుకోండి: