దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకే సవాల్ విసిరిన నెల రోజులు గడవకముందే కటకటాల పాలైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మనస్తత్వాన్ని పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. యువ దశ నుంచి వివాహం వరకు వరుసగా ఎదురైన అవమానాలు, ఆత్మగౌరవానికి వచ్చిన గాయాలు, కుటుంబ ఒత్తిళ్లతో డబ్బే జీవిత లక్ష్యమని నిర్ణయించుకున్న రవి, ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. 2016లో ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భార్య ఉన్నత కుటుంబానికి చెందిన కారణంగా జీవనశైలి, ఆర్థిక స్థితి వంటి అంశాలు ఇద్దరి మధ్య విభేదాలకు దారితీశాయి. రవి చేస్తున్న సంపాదనతో కష్టాలు తప్పట్లేదని భావించిన భార్య, అత్తగారు తరచూ హేళన చేయడం అతనికి తీవ్రమైన మానసిక భారమైంది. ఈ అవమానాలు అతని జీవితం మీద గాఢ ప్రభావం చూపించాయి.


తనకున్న వెబ్‌డిజైనింగ్‌ అనుభవంతో ‘ఐబొమ్మ’, ‘బప్పం టీవీ’ వంటి వెబ్‌సైట్లకు రూపం ఇచ్చి క్రమంగా వాటిని అభివృద్ధి చేశాడు. కొద్ది నెలల్లోనే బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి భారీ స్థాయిలో ప్రకటనలు రావడం ప్రారంభమైంది. ఊహించని విధంగా డబ్బు రాబడి పెరగడంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. తన సంపాదనను ఆధారాలతో చూపించినా, ఆర్థిక భద్రత ఉన్నప్పటికీ భర్తతో కలిసి ఉండటానికి భార్య ముందుకు రాలేదు. చివరికి 2021లో ఇద్దరూ విడిపోయారు.విడాకుల అనంతరం రవి నెదర్లాండ్స్‌లో మకాం మార్చి, అక్కడి నుంచే ఈ వెబ్‌సైట్లను రహస్యంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. సినిమాలను ఉచితంగా అందిస్తున్నట్లు చూపిస్తూ, వాటి వెనక దాగి ఉన్న వ్యక్తిగత డేటా సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేశాడు. ఈ విధంగా సుమారు 50 లక్షల మంది వినియోగదారుల డేటాను సైబర్ నేరస్తులకు, గేమింగ్ ముఠాలకు విక్రయించి దాదాపు 20 కోట్ల రూపాయలు సంపాదించాడు.



ఇంకా విదేశాల్లో పూర్తిగా స్థిరపడే ఆలోచనలో భాగంగా కూకట్‌పల్లిలోని తన ఫ్లాట్‌ను విక్రయించి వచ్చిన సొమ్ముతో మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని యోచిస్తున్న సమయంలోనే పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో అతని దారుణ ప్రయాణం ముగిసింది.
దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ విసిరే ఏ నేరస్థుడికైనా చివరికి ఎదురయ్యేది జైలు గదులేనని నగర సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలతో సామాన్య ప్రజలను దోచుకుని తప్పించుకోవడం ఎప్పుడూ సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఉచితంగా సినిమాలు చూడండి అని చెప్పే వెబ్‌సైట్ల వెనుక ఎంతటి చీకటి కోణం దాగి ఉంటుందో ప్రజలు గుర్తించాలని, అలాంటి అక్రమ ప్లాట్‌ఫార్మ్‌లను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: