హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం స‌డెన్‌గా లాక్‌డౌన్ ని ప్ర‌క‌టించింది.అయితే గ‌త ఏడాది మార్చి లో కేంద్ర‌ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్‌లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులుకు గురైయ్యారు.ప్రధానంగా ఇత‌ర రాష్ట్రాల్లో కూలీ ప‌నుల‌కు, ఉద్యోగాల‌కు వెళ్లిన వారు సొంత రాష్ట్రాల‌కు రావ‌డానికి అనేక వ్య‌య‌ప్ర‌సాయ‌లు ప‌డ్డారు.అయితే మ‌ళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది.గ‌త నెల రోజులుగా క‌రోనా కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ ఎలాంటి ఆంక్ష‌లు విధించ‌కుండా...హైకోర్టు తీవ్ర‌స్థాయిలో మొట్టికాయ‌లు వేయ‌డంతో ఇప్పుడు లాక్‌డౌన్ పెట్ట‌డం ప్ర‌భుత్వానికి అనివార్య‌మైంది.

తెలంగాణాలో ఉన్న వ‌ల‌స కూలీల ప‌రిస్థితి ఏంటి...?

గ‌త లాక్‌డౌన్ లో ప్ర‌భుత్వానికి చాలా అనుభ‌వాలు ఎదురైయ్యాయి.తెలంగాణాలో ఉన్న ఇత‌ర రాష్ట్రాల వారు ఆయా రాష్ట్రాల‌కు వెళ్ల‌డానికి అనేక ఇబ్బందుల‌కు గురైయ్యారు.గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితులు రాకుండా ఉండేలా ప్ర‌భుత్వం ముందుగానే చ‌ర్య‌లు తీసుకోవాల్సింది.కానీ ఎలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు లేకుండా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ వ‌ల‌స‌కూలీల ఆక‌లి కేక‌లు వినాల్సి వ‌స్తుంది.

మొద‌టి ద‌శ క‌రోనా స‌మ‌యంలో దాదాపుగా రెండు నెల‌ల‌పాటు లాక్‌డౌన్ ఆంక్ష‌లు కొన‌సాగాయి.రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో ప్ర‌త్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కొత్త‌వారిని ఎవ‌రిని ఆయా రాష్ట్రాల్లోకి రానివ్వ‌లేదు.ఆ త‌రువాత క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో మ‌ళ్లీ ఎవ‌రికి వాళ్లు పొట్ట‌కూటికోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స‌ వెళ్లారు.తెలంగాణ‌లో చాలామంది సెటిలర్స్ మ‌ళ్లీ త‌మ వ్యాపారాలు,ఉద్యోగాలు,ప‌నులు ప్రారంభించుక‌న్నారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌ళ్లీ లాక్‌డౌన్ పెట్ట‌డంతో ఇప్పుడు వారి ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా ఉంది.

ప్ర‌ధానంగా ఈ లాక్‌డౌన్‌తో వ‌ల‌స‌కూలీల ప‌రిస్థితి అగ‌మ్య‌ఘోచ‌రంగా మార‌నుంది. మొద‌టి ద‌శ క‌రోనా త‌గ్గిన త‌రువాత ఏపీ తో పాటు ఇత‌ర రాష్ట్రాల నుంచి హైద‌రాబాద్ కి వ‌ల‌స కూలీలు అనేక‌మంది వ‌చ్చారు.ఇప్పుడు వారంతా త‌మ సొంత ఊళ్ల‌కు వెళ్లేందుకు స‌రైన ర‌వాణా సౌక‌ర్యం లేదు. ఇప్ప‌టికే ఏపీ తెలంగాణ‌ల మ‌ధ్య బ‌స్సు స‌ర్వీసులు నిలిచిపోయాయి. వ‌ల‌స వచ్చిన వారంతా రోజువారీ ఏదో ఒక‌ప‌ని చేసుకుంటూ హైద‌రాబాద్‌లో జీవ‌నం సాగించేవారే. ఇప్పుడు ప్ర‌భుత్వం స‌డెన్‌గా లాక్‌డైన్ పెట్ట‌డంతో వీరంతా ప‌ని లేక ప‌స్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది. ప్ర‌భుత్వం వీరంద‌రికి ప్ర‌స్తుతం ఎలాంటి భ‌రోసా క‌ల్పించ‌లేదు.ఒక‌వేళ సొంత ఊళ్ల‌కు వెళ్లాల‌నుకుంటే క్యాబ్‌ల ద్వారా మాత్ర‌మే వెళ్లాల్సి ఉంటుంది..కానీ వీరు అంత ఖ‌ర్చు పెట్టి ఊరు వేళ్లే సాహసం చేయ‌లేరు.

ప్ర‌స్తుతం విధించిన లాక్‌డౌన్ ప‌దిరోజులు మాత్ర‌మే ఉంటుంద‌నేది ఖ‌చ్ఛితంగా చేప్పలేని ప‌రిస్థితి ఉంది.కాబ‌ట్టి ఈ ప‌దిరోజులు ఏలాగోలా ఉందామ‌ని వ‌ల‌స‌కూలీలు ఉన్నా ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో తెలియ‌ని ప‌రిస్థితి. కాబ‌ట్టి తెలంగాణ‌లో ఉన్న వ‌ల‌స‌కూలీల‌ను ప్ర‌భుత్వం ఈ లాక్‌డౌన్‌లో ఆదుకోక‌పోతే మాత్రం మ‌ళ్లీ ఆక‌లికేక‌లు త‌ప్పేలా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: