ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రులకు ఆయన లేఖలు రాశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని విన్నవించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ, ముఖ్య నేతల కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని చంద్రబాబు కోరారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడులు, జగన్‌ సర్కారు పనితీరును లేఖలో వివరించారు చంద్రబాబు. గంజాయి, డ్రగ్స్‌, హెరాయిన్‌ వంటి అంశాలను అందులో ప్రస్తావించారు.

వైసీపీ దాడులపై తాను రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసినా స్పందించ లేదన్న విషయాన్ని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. అనధికారికంగా ఒక పోలీస్‌ పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డారని లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులు కుట్ర పూరితంగా జరిగాయని, ఈ అంశంపై సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు విన్నవించారు. లా అండ్‌ ఆర్డర్‌ను అధికార పార్టీ నేతలు చేతుల్లోకి తీసుకున్నారని, స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం వంటి పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడులు జరిగాయని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రులకు రాసిన లేఖలో చంద్రబాబు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: