గంజాయి సాగు చేయడం ద్వారా కలిగే దుష్పరిణామాలను పోలీసులు, పలువురు నిపుణులు గిరిజనులకు వివరించారు. మరోవైపు విస్తృతంగా ఎస్ఈబీ అధికారులు తనఖీలు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్లు, ప్రధాన మార్గాలలో తనిఖీ చేస్తూ నిఘాను పటిష్టం చేసారు. మొత్తం దాదాపుగా 283 కేసులు నమోదు చేసి ఇప్పటికే 763 మందిని అరెస్ట్ చేసారు.
అదేవిధంగా 9,266 కిలోల గంజాయిని స్వాధీన పరుచుకుని 179 వాహనాలను జప్లు చేశారు పోలీసులు. విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసమే లక్ష్యంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు కొనసాగించారు. ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు, ఇతర సిబ్బంది మొత్తం 7 బృందాలుగా పాడేరులో మాకాం వేశారు. జీ మాడుగుల, గూడెంకొత్తవీధి, చింతపల్లి వంటి మండలాల్లో ఆదివారం దాదాపు 260 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేసారు.
అనకాపల్లి అసిస్టెంట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరిటెండెంట్ పర్యవేక్షణలో జీ మాడుగుల మండలంలోని బొయితిలి ప్రాంతంలో 40 ఎకరాలు, గుప్పవీధిలో 40 ఎకరాలు, ఎగువ వాకపల్లిలో 55 ఎకరాలు, దిగువ వాకపల్లిలో 55 ఎకరాలు, దాదాపు 2లక్షలకు పైగా గంజాయి మొక్కలను వేర్లతో సహా పీకేసి తగులబెట్టారు. అదేవిధంగా గూడెంకొత్తవీధి మండలంలోని రింతాడ, దామనపల్లి పంచాయతీల పరిధిలోని సిగినాపల్లి, నల్లబెల్లి, తుప్పలదొడ్డి, గుర్రాల వీధి, అసరాడ, కాకరపాడు మొదలైన గ్రామాలలో సుమారుగా 50 ఎకరాలలో.. చింతపల్లి మండలంలోని టేకుల వీధి, గడపరాయి గ్రామాల్లో 20 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించడమే ఆపరేషన్ పరివర్తన్ లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి